పదాతిదళాన్ని కుదించనున్న చైనా

12 Jul, 2017 23:05 IST|Sakshi
పదాతిదళాన్ని కుదించనున్న చైనా

నౌకాదళం, క్షిపణి వ్యవస్థలను బలోపేతం చేసేందుకే...
ఇప్పటిదాకా పదాతిదళం సంఖ్య 23 లక్షలు
పది లక్షలకే పరిమితం చేయనున్న డ్రాగన్‌ 
గతంలో పదాతిదళ  యుద్ధంపైనే దృష్టి
తాజా పరిస్థితుల నేపథ్యంలో సైనిక బలగాల పునర్‌వ్యవస్థీకరణ


బీజింగ్‌: ప్రపంచంలోనే భారీసంఖ్యలో సైనిక బలగాలను కలిగిన చైనా తన పదాతి దళాన్ని కుదించనుంది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ)లో మొత్తం సిబ్బంది సంఖ్య 23 లక్షలు కాగా ఇప్పుడు దీనిని పది లక్షల మేర తగ్గించనుంది. చరిత్రలోనే ఇది అతిపెద్ద  తగ్గింపుకానుంది. నౌకాదళం, క్షిపణి వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ దిశగా అడుగులు వేయనుంది. ఈ విషయాన్ని చైనా అధికార మీడియా బుధవారం వెల్లడించింది. పీఎల్‌ఏను పునర్‌వ్యవస్థీకరించే ప్రక్రియలో భాగంగా సైన్యంతోపాటు ఇతర బలగాలను సమం చేయనుంది.

ఈ విషయాన్ని చైనా సైనిక విభాగం అధికార మీడియా అయిన పీఎల్‌ఏ డైలీ వెల్లడించింది. నౌకాదళం, క్షిపణి బలగాలసహా ఇతర విభాగలలో సిబ్బందిని పెంచనుంది. పురాతన సైనిక వ్యవస్థలో పెద్దసంఖ్యలో సిబ్బంది పనిచేస్తున్నారని, వీరిని ఇతర విభాగాలను బదలాయిస్తామని తెలిపింది. ‘వ్యూహాత్మక లక్ష్యాలు, భద్రతా అవసరాలను బట్టి సంస్కరణలు చేపడతామని తెలిపింది. కాగా పీఎల్‌ఏ గతంలో పదాతిదళ యుద్ధంతోపాటు దేశ అంతర్గత భద్రతావసరాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. అయితే ఇప్పుడు ఈ విధానంలో ప్రాథమిక మార్పులు తీసుకురానుంది.

క్రియాశీలక పీఎల్‌ఏ సైనిక బలగాల సంఖ్యను పదిలక్షలకు కుదించడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. పీఎల్‌ఏ వైమానిక దళం సిబ్బందిని మాత్రం అలాగే ఉంచనుంది. తాజా ప్రతిపాదనతో నౌకాదళం, స్ట్రాటజిక్‌ సపోర్ట్‌ ఫోర్స్, రాకెట్‌ ఫోర్స్‌ సంఖ్య పెరుగుతుందని గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక మంగళవారం రాసిన కథనంలో పేర్కొంది. భద్రత దృష్ట్యా చైనా ప్రాథమ్యాలు, అవసరాలు మారిపోయాయని, అంతర్జాతీయస్థాయిలో విస్తరించాయని, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సైనిక విభాగం సలహాదారు జూ  గౌన్‌గ్యు చెప్పారు. చైనా అంతర్జాతీయ హోదాకు తగ్గట్టుగా పీఎల్‌ఏని పునర్‌వ్యవస్థీకరిస్తామని ఆయన వివరించారు.  

కశ్మీర్‌ అంశంలో వేలుపెడతాం
బీజింగ్‌: సిక్కిం సరిహద్దులోని డోక్లాంను దురాక్రమించడానికి యత్నిస్తున్నా చైనా తాజాగా భారత్‌ను మరోసారి రెచ్చగొట్టిం ది. కశ్మీర్‌లో పరిస్థితి చేయి దాటినందున అంతర్జాతీయ జోక్యం అనివార్యమని స్పష్టం చేసింది. నియంత్రణ రేఖ వద్ద పరి స్థితులు విషమించాయని, హింస ఇలాగే కొనసాగితే ఈ ప్రాంతంలో సుస్థిరత దెబ్బతింటుందని పేర్కొంది. భారత్, పాక్‌ సంబంధాలను బలోపేతం చేయడంలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చైనా విదేశాంగమంత్రిత్వశాఖ ప్రతినిధి గెంగ్‌ షువాంగ్‌ బుధవారం చెప్పారు. కశ్మీర్‌ ద్వైపాక్షిక అంశమని, ఇందులో మూడోపక్షం జోక్యానికి తావే లేదని భారత్‌ మొదటి నుంచీ చెబుతున్న సంగతి తెలిసిందే.

భారత్‌–పాక్‌ మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికే డ్రాగన్‌ ఈ ప్రకటన చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, భూటాన్‌ తరఫున డోక్లామ్‌లో చైనాకు వ్యతిరేకంగా ఇండియా ఎలా పోరాడుతున్నదో కశ్మీర్‌ అంశానికీ అదే వర్తిస్తుందని ఆ దేశ నిపుణుడు ఒకరు ఇటీవల హెచ్చరించారు. డోక్లామ్‌ భారత్‌ భూభాగం కాదన్నారు. ఒకవేళ పాకిస్థాన్‌ కోరితే తమ సైన్యం కశ్మీర్‌లో అడుగుపెడుతుందని చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పత్రికకు రాసిన వ్యాసంలో చైనా వెస్ట్‌ నార్మల్‌ యూనివర్సిటీ డైరెక్టర్‌ లాంగ్‌ జింగ్‌చున్‌ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు