ఎంతైనా.. చైనా కదా!

8 Mar, 2017 07:35 IST|Sakshi
ఎంతైనా.. చైనా కదా!

అసాధ్యాలను సుసాధ్యం చేయడం ఆ దేశానికి అలవాటే. మానవులకు అసాధ్యమనే రీతిలో నిర్మాణాలు, అబ్బురపరిచే రోబోలకు ఆ దేశం కేరాఫ్‌ అడ్రస్‌. ఇక టెక్నాలజీని కాపీ చేయడంలో ఆ దేశం తర్వాతే ఇంకేదైనా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న ప్రతి ఐదు ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లో ఒకటి ఆ దేశానికి చెందినదే! ఇదంతా ఏ దేశం గురించో మీకిప్పటికే అర్థమై ఉంటుంది. అవును.. చైనా గురించే. మళ్లీ తాజాగా ఏం చేసిందో తెలుసుకోవాలనే ఆరాటపడుతున్నారు కదూ..? అయితే మీరు ఈ వార్త చదివిన తర్వాత ఆ దేశం గురించి మీరు ఓ మాట అనడం ఖాయం. ఎందుకంటే అది ఎంతైనా.. చైనా కదా!!

కొత్తరకం రాకెట్ల తయారీకి చైనా నాంది పలికింది. ఇకపై రాకెట్‌ లాంచ్‌ సెంటర్ల నుంచి కాకుండా విమానాల నుంచే ప్రయోగించి అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపించేందుకు సన్నాహాలు చేస్తోంది. కాలంచెల్లిన ఉపగ్రహాల స్థానంలో కొత్త ఉపగ్రహాలను పంపడానికి, వాటి కక్ష్యలోకి మరింత వేగంగా కొత్త ఉపగ్రహాలను పంపేందుకు ఈ ప్రయోగం తోడ్పడుతుందని చైనా అకాడమీ ఆఫ్‌ లాంచ్‌ వెహికల్‌ టెక్నాలజీలోని రాకెట్‌ డెవలెప్‌మెంట్‌ కెరీర్‌ విభాగం ప్రొఫెసర్‌ లి టోంగ్యు తెలిపారు. వంద కిలోల బరువును తీసుకెళ్లే రాకెట్‌ నమూనాలను భూమికి సమీపంలోని కక్ష్యలోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.  ఆ తర్వాత 200 కిలోల బరువును మోసుకెళ్లే రాకెట్‌ తయారీకి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.

20వేల కిలోల బరువుతో...
రాకెట్ల రవాణా కోసం ప్రత్యేకంగా వై–20 విమానాన్ని తయారు చేయనున్నారు. విమానం నుంచి విడిపోయిన తర్వాత రాకెట్‌ రాజుకొని అంతరిక్షంలోకి దూసుకెళ్తుందని లీ చెబుతున్నారు. దేశీయంగా తయారుచేస్తున్న మొదటి అధిక బరువును మోసుకెళ్లే రవాణా వాహనం ఇదే కావడం విశేషమని, విమానం అత్యధిక టేకాఫ్‌ బరువు 200 మెట్రిక్‌ టన్నులుగా ఉంటుందని, అది మోయగలిగే సామర్థ్యం 66 టన్నులని ఆయన చెప్పారు.

ఎంతో ఆదా...
విమానాల నుంచి రాకెట్లను ప్రయోగించడం వల్ల భూ ఆధారిత లాంచింగ్‌తో పోలిస్తే సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. భూ ఆధారిత ద్రవ ఇంధనం నింపడానికే రోజుల సమయం పడుతోందని, అదే ఘన ఇంధన రాకెట్ల ప్రయోగం త్వరగా పూర్తవుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. భూమికి 700 కిలోమీటర్లు దూరంలో ఉన్న సూర్య–సమస్థితి కక్ష్యలోకి 200 కిలోల ఉపగ్రహాన్ని వై20 విమానం ద్వారా పంపించే ఏర్పాట్లను కేవలం 12 గంటల్లో పూర్తి చేయవచ్చని లాంగ్‌ లెహవో తెలిపారు. ప్రత్యేకంగా భూమి మీద ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం కూడా లేదంటున్నారు.   

ఓ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లాలంటే భూమ్యాకర్షణ శక్తిని అధిగమించే వేగం దాని సొంతం కావాలి. అందుకోసం రాకెట్‌లో అనేక దశల్లో ఇంధనం మండడానికి ఏర్పాట్లు చేయడం, ప్రయోగించడానికి ప్రత్యేక రాకెట్‌ లాంచ్‌ సెంటర్‌ వంటి దానిని ఏర్పాటు చేయడం తప్పనిసరి. అయితే ఇదంతా ఎంతో వ్యయప్రయాసలతో కూడినది. అలా కాకుండా రాకెట్‌ను విమానం సాయంతో నింగిలోకి తీసుకెళ్లి.. అక్కడి నుంచి నేరుగా అంతరిక్షంలోకి పంపితే.. ఈ ఖర్చంతా తగ్గుతుంది కదా? పైగా ఎంతో ఇంధనం ఎంతో ఇంధనం కూడా ఆదా అవుతుంది కదా? మరి ఇంతగా టెక్నాలజీ పెరిగినా శాస్త్రవేత్తలు ఈ దిశగా ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదు? ... ఈ ప్రశ్నకు సమాధానం చెబుతోంది చైనా.
– సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌