డోక్లాం వద్ద మళ్లీ కలకలం

11 Dec, 2017 12:48 IST|Sakshi

భారీగా సైన్యాన్ని మోహరించిన చైనా

శీతాకాల క్యాంప్‌ అని ప్రకటన

అప్రమత్తంగా ఉన్న భారత్‌

సాక్షి, న్యూఢిల్లీ : డోక్లాం వద్ద మళ్లీ చైనా బలగాలు భారీగా మోహరించాయి. సుమారు 1600 నుంచి 1800 మందితో కూడిన చైనీయ సైన్యం అక్కడ క్యాంప్‌ ఏర్పాటు చేసింది. గడ్డ కట్టే చలిలో రెండు హెలిప్యాడ్లు, గుడిసెలు, స్టోర్లు ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతంలో తమ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 
 
ఇక డొక్లాం దక్షిణ ప్రాంతమైన ఝంపేరి రిడ్జ్‌ దగ్గర చైనా ఆర్మీ మోహరించిందని భారత సైన్యం కూడా ధృవీకరించింది. ఈ విషయంపై చైనా తన వాదనను వినిపించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(చైనా సైన్యం) ప్రతీ ఏటా వేసవి, శీతాకాలాల్లో ఇక్కడ క్యాంపులు నిర్వహించటం సహజం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత క్యాంపును ఏర్పాటు చేసినట్లు చెబుతోంది. కానీ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న భారత సైన్యం మాత్రం అప్రమత్తంగా ఉన్నట్లు ప్రకటించింది.

కాగా, సిక్కిం-భూటాన్‌-టిబెట్‌ ట్రై జంక్షన్ అయిన డోక్లాం వద్ద 73 రోజులపాటు భారత్‌-చైనా సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. భారీ ఆయుధాల తరలింపు.. ఎదురుపడినప్పుడల్లా, కవ్వింపు చర్యలకు పాల్పడిన చైనా, భారత్ సైనికుల దృశ్యాలు అప్పట్లో కంగారు పుట్టించాయి. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
 

మరిన్ని వార్తలు