చైనా టీకా ఫలితాలూ భేష్‌!

22 Jul, 2020 03:57 IST|Sakshi

లాన్సెట్‌ జర్నల్‌లో ఫలితాలు

రెండో దశ ప్రయోగాల్లో పాల్గొన్న వారెవరికీ సోకని వైరస్‌

బీజింగ్‌: కరోనా వైరస్‌ నిరోధానికి చైనా అభివృద్ధి చేస్తున్న టీకా రెండో దశ మానవ ప్రయోగాల్లోనూ సురక్షితమైందే కాకుండా.. వైరస్‌కు వ్యతిరేకంగా రోగ నిరోధక వ్యవస్థ స్పందించేలా చేస్తోందని అంతర్జాతీయ వైద్య పరిశోధనల జర్నల్‌ ‘ద లాన్సెట్‌’లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం తెలిపింది. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ సిద్ధం చేస్తున్న టీకా ఫేజ్‌1, 2 ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజే ఈ ఫలితాలురావడం గమనార్హం. టీకా భద్రతను, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని అంచనా వేసేందుకు నిర్వహించిన ఫేజ్‌ 2 ప్రయోగాలు సత్ఫలితాలిచ్చాయని, ఫేజ్‌ –1లో 55 ఏళ్ల పైబడ్డ వారు కొంతమందికి టీకా అందించగా.. తరువాతి దశలో ఎక్కువమందికి టీకాను ఇచ్చామని టీకా ప్రయోగాల్లో పాల్గొన్న చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ శాస్త్రవేత్తలు వివరించారు. టీకా వేసిన తరువాత రెండో దశ ప్రయోగాల్లో పాల్గొన్న వారెవరికీ వైరస్‌ సోకలేదని చెప్పారు. వైరస్‌ కొమ్ములను తయారు చేసేలా వైరస్‌ జన్యుపదార్థంలో మార్పులు చేశామని వివరించారు. టీకాలోని వైరస్‌ కణాల్లోకి ప్రవేశించి కొమ్ములను ఉత్పత్తి చేసిన తరువాత వినాళ గ్రంథులకు వెళ్లినప్పుడు వైరస్‌ వ్యతిరేక యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని తెలిపారు.  (ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లు సగం మనకే )

508 మందిపై ప్రయోగాలు
చైనా అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాను రెండో దశ మానవ ప్రయోగాల్లో భాగంగా 508 మందిపై ప్రయోగించారు. వీరిలో 253 మందికి అత్యధిక మోతాదులో టీకాను అందించగా 129 మందికి అత్యల్పంగా ఇచ్చారు. 126 మంది ఉత్తుత్తి టీకా ఇచ్చారు. ప్రయోగాల్లో పాల్గొన్న వారిలో మూడింట రెండు వంతుల మంది 18–44 మధ్య వయస్కులు కాగా 13 శాతం మంది 55 ఏళ్లపైబడ్డ వారు. టీకా ఇచ్చిన అరగంట నుంచే వారందరినీ పరీక్షించడం మొదలుపెట్టామని, 14, 28 రోజుల తరువాత పరిశీలనలు జరిపామని పరిశోధన వ్యాసంలో వివరించారు. కొంతమందిలో జ్వరం, నిస్సత్తువ వంటి దుష్ప్రభావాలు కనిపించాయని తెలిపారు. మొత్తమ్మీద చూసినప్పుడు అధిక మోతాదులో టీకా తీసుకున్న వారిలో 95 శాతం మందిలో, తక్కువ మోతాదు టీకా తీసుకున్న వారిలో 91 శాతం మందిలోనూ రోగ నిరోధక వ్యవస్థ స్పందించినట్లు స్పష్టమైంది. టీకా తీసుకున్న 28 రోజుల తరువాత జరిపిన పరిశోధనల్లో వీరిలో యాంటీబాడీలు లేదా టి–కణాలు ఉత్పత్తి అయినట్లు గుర్తించారు.  (యాంటిజెన్ పరీక్షల్లో నెగెటివ్ సీటీస్కాన్లో పాజిటివ్)

ఇంకో టీకాతోనూ సత్ఫలితాలు
కరోనా వైరస్‌ నిరోధానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇంకో తొలి విజయం నమోదైంది. భారతీయ సంతతి శాస్త్రవేత్త అమిత్‌ కాంధార్‌తో కూడిన పీఏఐ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ తయారు చేసిన టీకా ఎలుకలు, కోతులు రెండింటిలోనూ వైరస్‌ నిర్వీర్యానికి పనికొచ్చే యాంటీబాడీలను ఉత్పత్తి చేసినట్లు స్పష్టమైంది. ఒకే ఒక్క డోసుతో వారీ ఘనతను సాధించినట్లు సైన్స్‌ ట్రాన్స్‌లేషనల్‌ మెడిసిన్‌లో ప్రచురితమైన పరిశోధన వివరాల ద్వారా తెలిసింది. టీకా ప్రయోగించిన రెండు వారాల్లోనే యాంటీబాడీల ఉత్పత్తి మొదలైందని కంపెనీ వివరించింది. (నిమ్స్ ట్రయల్స్ .. తొలి అడుగు సక్సెస్‌)

మరిన్ని వార్తలు