'మా అధ్యక్షుడు ఓకే చెబితేనే లెక్కను వివరిస్తాం'

18 Jun, 2020 13:18 IST|Sakshi

బీజింగ్‌ : లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయలో సరిహద్దుకు సంబంధించి భారత్‌- చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో చైనా సైనికులు ఎంతమంది చనిపోయారన్న విషయంపై ఆ దేశం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. సరిహద్దు ఘర్షణలో భారత్‌ నుంచి ఒక కల్నల్‌ అధికారి సహా 20 మంది జవాన్లు ప్రాణత్యాగం చేసినట్లు మంగళవారం ఉదయం భారత ప్రభుత్వం ప్రకటించింది. అంతేగాక ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన సైనికులు తీవ్రంగా గాయపడ్డారని, మృతి చెందిన సైనికుల్లో 40 మంది చైనా సైనికులు ఉన్నారని భారత ఆర్మీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. దీనిపై చైనా విదేశాంగా శాఖ స్పందిస్తూ భారత సైనికులతో ఘర్షణ జరిగిన మాట నిజమేనని చెప్పింది కానీ తమ సైనికులు ఎంతమంది చనిపోయారన్నది మాత్రం పేర్కొనలేదు. అయితే ఘర్షణలో ఎంతమంది సైనికులు చనిపోయారనే దానిపై ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌  ఓకే అంటేనే అధికారికంగా లెక్కలు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అక్కడి సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ ప్రచురించిన కథనంలో పేర్కొంది. (చైనా అధ్యక్షుడి సాయం కోరిన ట్రంప్‌)

ఆ రిపోర్టులో.. 'చైనాలో సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చేతిలో ఉంటుంది. ఘర్షణలో మృతి చెందిన చైనా సైనికుల జాబితా విడుదల చేయడానికి ముందు జిన్‌పింగ్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అంతేగాక 1962లో చైనా- ఇండియా మధ్య తలెత్తిన యుద్దంలో దాదాపు 2వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు గాల్వన్‌ లోయలో తలెత్తిన ఘర్షణలో ఎంతమంది చనిపోయారనే విషయం వెల్లడిస్తే మరోసారి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సంఖ్య వెల్లడించలేదని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) ప్రకటించింది. అమెరికాతో కీలక సమావేశం ఉన్నందున ఈ విషయాన్ని తక్కువ చేసి చూడాలని చైనా భావించి ఉంటుంది. ఇదిలా ఉంటే గల్వాన్ నది లోయలో జరిగిన ఘర్షణలో రెండు వైపులా ప్రాణనష్టానికి దారితీసిందని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ వెస్ట్రన్‌ థియేటర్ కమాండ్ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ షుయిలీ మంగళవారం పేర్కొన్నారని,  అయితే ఆయన కూడా చైనా ప్రాణనష్టం గురించి వివరించలేదని అని రిపోర్టులో తెలిపింది.(అదే చైనా వ్యూహం: జిజి ద్వివేదీ)

మరోవైపు చైనా ప్రభుత్వ అధికార పత్రికగా ఉన్న గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ హు జిజిన్‌ స్పందిస్తూ..' నాకు తెలిసినంత వరకు ఈ ఘర్షణలో చైనా కూడా నష్టపోయింది. చైనా సంయమనాన్ని భారత్‌ తప్పుడు దృష్టితో చూడొద్దు. దీనిని అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. చైనా భారత్‌తో యుద్దం చేసేందుకు సిద్ధంగా లేదు. సామరస్య పద్దతిలో సమస్యను పరిష్కరించుకుందాం' అంటూ ట్వీట్‌ చేశారు. (స్వస్థలాలకు చేరిన వీర జవాన్ల మృతదేహాలు)

మరిన్ని వార్తలు