ఓపిగ్గా వ్యవహరిస్తాం

17 Mar, 2019 04:20 IST|Sakshi

అజహర్‌ విషయంలో ఐరాసలో చైనా వ్యవహారశైలిపై భారత్‌  

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌/న్యూయార్క్‌: జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ను ఐక్యరాజ్యసమితి(ఐరాస) అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో ఓపిగ్గా వ్యవహరిస్తామని భారత్‌ తెలిపింది. అయితే ఉగ్రవాదంపై పోరాటం విషయంలో ఎక్కడా రాజీపడబోమని స్పష్టం చేసింది. పాక్‌ భూభాగంలో ఆశ్రయం పొందుతున్న కొన్ని ఉగ్రసంస్థలు చైనా ప్రయోజనాలకూ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని గుర్తుచేసింది. ఇటీవల సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ భద్రతామండలిలో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా చైనా నాలుగోసారి అడ్డుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య మరే దేశమయినా మధ్యవర్తిత్వం చేయొచ్చన్న వాదనలను తోసిపుచ్చారు. మసూద్‌ అజహర్‌ విషయంలో చైనా మెతకవైఖరి నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ దౌత్యాధికారులు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయమై చైనా ప్రతినిధులతో చర్చలు ప్రారంభించారు. మసూద్‌ను చైనా భద్రతామండలిలో కాపాడటంపై అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక తన సంపాదకీయంలో ఘాటుగా విమర్శించింది.

మరిన్ని వార్తలు