భారత్‌లో ఆ ప్రాంతాలకు వెళ్లకండి : చైనా

28 Dec, 2017 16:46 IST|Sakshi

బీజింగ్‌ : భారత్‌లోని పలు నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లొద్దని తమ దేశ పౌరులను చైనా హెచ్చరించింది. చైనా పౌరులు ఇండియాలోని పలు నిషేధిత ప్రాంతాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తూ జరిమానాలు చెల్లిస్తుండటంతోపాటు విచారణ ఎదుర్కోవడం అవసరం అయితే, జైళ్లకు కూడా వెళుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికను జారీ చేసింది. భారత్‌లోని స్థానిక చట్టాలను తప్పనిసరిగా గౌరవించాలని కూడా చైనా తమ పౌరులకు సూచించింది. ఓ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం మణిపూర్‌లోని ఇండియా-మయన్మార్‌ సరిహద్దులో ఓ చైనీయుడిని గుఢాచారిగా అనుమానిస్తూ పోలీసులు అరెస్టు చేశారు.

గతంలో కూడా ఇలాంటి అరెస్టులు చాలా జరిగాయి. భారత స్థానిక చట్టాలను ఉల్లంఘించారని వారికి జరిమానాలు విధించడం, వీలయితే జైలులో పెట్టడం కూడా సమర్థంగా భారత్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే ఢిల్లీలోని చైనా విదేశాంగ కార్యాలయం మాండరిన్‌ భాషలో తమ పౌరులకు వార్నింగ్‌ నోటీసులు విడుదల చేసింది. తమ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో భారత్‌లోని నిషేధిత ప్రాంతాలకు వెళ్లవద్దని ఆ నోటీసులో కోరారు. అంతేకాకుండా నిషేధిత వస్తువులను కొనడంగానీ, దగ్గర పెట్టుకోవడంగానీ, చైనాకు తీసుకెళ్లే ప్రయత్నం చేయొద్దని ప్రత్యేకంగా అందులో సూచించింది.

మరిన్ని వార్తలు