సహనానికీ హద్దు ఉంటుంది

5 Aug, 2017 06:51 IST|Sakshi
సహనానికీ హద్దు ఉంటుంది

డోక్లాంపై చైనా
భారత్‌...తన బలగాలను ఉపసంహరించాల్సిందే

బీజింగ్‌:
డోక్లాం వివాదం విషయంలో భారత్‌పట్ల తాము ఎంతో సౌహార్ద్ర భావనతో మెలిగామని, అయితే సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని డ్రాగన్‌ తాజాగా వ్యాఖ్యానించింది.  సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత నెలకొనడమనేది ఎంత సున్నితంగా మెరుగుపరుచుకుంటామనేదానిపై ఆధారపడి ఉంటుందంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొన్న నేపథ్యంలో డ్రాగన్‌ శుక్రవారం పైవిధంగా స్పందించింది. డోక్లాం వివాదంపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ గత నెలలో పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటే ఇరుదేశాలు వివాదాస్పద ప్రాంతం నుంచి బలగాలను విధిగా వెనక్కి తీసుకుంటేనే చర్చలు జరుపుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.

ఈ విషయమై చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి రెన్‌ గ్యుయో కియాంగ్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సరిహద్దులో శాంతిని పునరుద్ధరించడంకోసం భారత్‌ తగురీతిలో వ్యవహరించాలని సూచించారు. ‘వివాదం తలెత్తిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పటిలాగే కొనసాగేలా చూడడంకోసం మా బలగాలు ఎంతో సంయమనం పాటించాయి. అయితే మా సౌహార్ద్రతకు, సంయమనానికి కూడా ఓ హద్దు ఉంటుంది’అని హెచ్చరించారు. జాప్యం చేస్తే సమస్య సమసిపోతుందనే ఎత్తుగడను భారత్‌ విడనాడాలన్నారు. తమ సైనిక బలగాల సత్తాను తక్కువ అంచనా వేయొద్దంటూ హెచ్చరించారు.

ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి
డోక్లాం వివాదం విషయంలో ఒకవైపు చైనాతో దౌత్యపరంగా, మరోవైపు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం భూటాన్‌తో సమన్వయంతో ముందుకుసాగుతున్నామని భారత్‌ శుక్రవారం పేర్కొంది. డోక్లాంలో భారత్‌...తన బలగాలను 400 నుంచి 40కి తగ్గించాలంటూ చైనా డిమాండ్‌ చేసిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా సూటిగా జవాబిచ్చేందుకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్‌ బాగ్లే నిరాకరించారు. ఇది కార్యాచరణకు సంబంధించిన విషయమన్నారు. సరిహద్దులో శాంతిని నెలకొల్పడమే తమ లక్ష్యమన్నారు.

మరిన్ని వార్తలు