మోదీ ప్రకటనను స్వాగతించిన చైనా

4 Jun, 2018 18:27 IST|Sakshi

బీజింగ్‌ : సరిహద్దు సమస్య సహా పలు అంశాల పరిష్కారంపై భారత్‌, చైనా పరిణితితో వ్యవహరిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్‌లో చేసిన వ్యాఖ్యలను బీజింగ్‌ స్వాగతించింది. మోదీ ప్రకటన సానుకూల పరిణామమని పేర్కొంది. భారత్‌-చైనా సంబంధాలపై ప్రధాని మోదీ చేసిన సానుకూల ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హ చునింగ్‌ చెప్పారు.ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య ఇటీవల బీజింగ్‌లో జరిగిన భేటీలో పలు అంశాలపై కుదిరిన ఒప్పందాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

ఇరువురు నేతల భేటీలో అంతర్జాతీయ అంశాలతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై సంప్రదింపులు జరిగాయని, పలు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారని పేర్కొన్నారు.విభేదాల పరిష్కారంలో తెలివైన, పరిణితితో కూడిన మార్గంతో ముందుకెళ్లాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయని గుర్తుచేశారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి సామరస్యాలు నెలకొనేలా పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయని చెప్పారు. మరోవైపు జూన్‌ 9, 10 తేదీల్లో షాంఘై సదస్సు నేపథ్యంలో మోదీ, జిన్‌పింగ్‌ క్వింగ్ధాలో మరోసారి భేటీ అవుతారని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు