అతిగా వాడితే ఇలానే అవుతది

23 Oct, 2018 17:00 IST|Sakshi

బీజింగ్‌ : ‘అతి సర్వత్రా వర్జయతే’ అనేది పెద్దల మాట. అంటే ఏ విషయంలో కూడా అతి పనికి రాదు అని అర్థం. అది తిండి కావొచ్చు.. నిద్ర కావొచ్చు.. పని కావొచ్చు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ వాడకంలో ఈ అతి అస్సలు మంచిది కాదని నిపుణులు కూడా చెబుతున్నారు. కానీ ఆ మాటలు మనం చెవికెక్కించుకోం.. ఆనక తీరిగ్గా బాధపడుతుంటాము. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఓ మహిళకు. వారం రోజులపాటు కంటిన్యూయస్‌గా స్మార్ట్‌ఫోన్‌ వాడటంతో ఆమె చేతి వేళ్లు పని చేయకుండా పోయాయి. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది.

వివరాలు.. చాంగ్షా పట్టణానికి చెందిన ఓ మహిళ వారం రోజుల పాటు ఆఫీస్‌కు సెలవు పెట్టింది. ఈ ఖాళీ సమయంలో పూర్తిగా తన ఫోన్‌కు అంకితమయ్యింది. కేవలం నిద్ర పోయేటప్పుడు తప్ప మిగతా సమయమంతా ఫోన్‌తోనే గడిపింది. ఇంకేముంది.. కొన్ని రోజుల తర్వాత ఆమె కుడి చేతిలో తీవ్రమైన నొప్పి రావడమే కాక చేతి వేళ్లి ఫోన్‌ని పట్టుకునే పోజిషన్‌లోనే బిగుసుకు పోయాయంట. వాటిని కొంచెం కూడా కదిలించడానికి రాకపోవడంతో ఆస్పత్రికి పరుగు తీసింది.

ఆమెని పరీక్షించిన డాక్టర్లు సదరు మహిళ ‘టెనోసినోవిటీస్‌’(రోజుల తరబడి చేతులను ఒకే విధంగా వాడటం వల్ల వచ్చే వాపు)తో బాధపడుతుందని తేల్చారు. అనంతరం వైద్యం చేసి ఆమె చేతి వేళ్లను యధాస్థితికి తీసుకొచ్చారు. అంతేకాక ఇక మీదటైనా స్మార్ట్‌ఫోన్‌ వాడకాన్ని తగ్గించమని సలహా ఇచ్చారు.

మరిన్ని వార్తలు