కరోనా: కేంద్ర బిందువుగా వుహాన్‌ వైరాలజీ సంస్థ

18 Apr, 2020 14:48 IST|Sakshi

బీజింగ్‌: ప్రస్తుతం ప్రపంచమంతా ఆరోగ్య, ఆర్థిక సంక్షోభానికి కారణమైన కరోనా వైరస్‌(కోవిడ్‌-19) గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది. మానవాళి మనుగడకు సవాలుగా పరిణమించిన ప్రాణాంతక వైరస్‌ పుట్టుక, వ్యాప్తికి కారణమైందంటూ చైనాపై పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మహమ్మారి జన్మస్థానంగా భావిస్తున్న వుహాన్‌ నగరంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వుహాన్‌లోని వైరాలజీ సంస్థలోనే కరోనా పురుడు పోసుకుందంటూ కోకొల్లలుగా కథనాలు వెలువడుతున్నాయి. కానీ చైనా శాస్త్రవేత్తలు మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు. మాంసం మార్కెట్ల నుంచే కరోనా వ్యాప్తి చెందిందని.. జంతువుల నుంచే మనిషికి సోకిందని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తికి గల కారణాలను అన్వేషించేందుకు అగ్రరాజ్యం అమెరికా దర్యాప్తు చేపట్టింది. దీంతో ఆసియాలోనే అతిపెద్ద వైరస్‌ స్టోరేజీ బ్యాంకుగా పేరొందిన వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ చెబుతున్నవి వాస్తవాలేనా లేదా అన్న విషయం త్వరలోనే తేలనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.(వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా లీకైంది...)

1500 వందల కంటే ఎక్కువ..
వివిధ పరిశోధనలు, వ్యాక్సిన్‌ల అభివృద్ధికై వైరాలజీ సంస్థలు కృషి చేస్తాయి. ఇందుకోసం వైరస్‌ల జన్యుక్రమాన్ని విశ్లేషించి.. వాటికి విరుగడు కనిపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అదే విధంగా వైరస్‌ల గురించి అప్రమత్తం చేసి... పలు జాగ్రత్తలను సూచిస్తాయి. ఇక చైనాలో వ్యాప్తంగా వుహాన్‌ వైరాలజీ సంస్థ ఈ బాధ్యతను సమర్థవంతగా నెరవేరుస్తోంది. సంస్థ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం ఇక్కడ దాదాపు 1500 రకాల వైరస్‌లను భద్రపరిచి ఉంచారు. అత్యంత భద్రత కలిగిన వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌గా పేరొందిన ఈ ల్యాబ్‌లో ఎబోలా వంటి మరెన్నో ప్రాణాంతక వైరస్‌లను ప్రిజర్వ్‌ చేశారు. దాదాపు 42 మిలియన్ల డాలర్ల వ్యయంతో 2015లో నిర్మించిన ఈ ల్యాబ్‌ను.. 2018లో ప్రారంభించారు. ఫ్రెంచ్‌ బయో ఇండస్ట్రియల్‌ సంస్థ భాగస్వామ్యంతో దీని నిర్మాణం చేపట్టారు. 

వుహాన్‌ నగర శివారులో కొండ ప్రాంతంలో దాదాపు 3 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో దీనిని నిర్మించారు. ఇక వైరస్‌లపై వదంతులు నమ్మకూడదంటూ.. ‘‘నివారణ, నియంత్రణ ముఖ్యం. ఎవరూ భయపడవద్దు. అధికారిక ప్రకటనలనే నమ్మాలి. సైన్సును నమ్మండి. పుకార్లు వ్యాప్తి చేయకండి’’అని పోస్టర్‌ను ల్యాబ్‌ కాంప్లెక్స్‌లో అమర్చారు. అయితే పూర్తి భద్రత నడుమ ఈ ల్యాబ్‌ను నిర్వహిస్తున్నామని చైనా చెబుతుంటే.. అమెరికా మాత్రం వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా లీకైందని వాదిస్తోంది.(కరోనా: చైనా లెక్కలపై స్పందించిన డబ్ల్యూహెచ్‌వో)

ఈ విషయం గురించి అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో శుక్రవారం మాట్లాడుతూ...‘‘వుహాన్‌ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ నుంచే ఈ వైరస్‌ ఉద్భవించిందని భావిస్తున్నాం. ఆ ల్యాబ్‌లో ఏం జరుగుతోంది.. పరిసరాలు ఎలా ఉంటాయి తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు వుహాన్‌ వెళ్తామంటే వారు అంగీకరించడం లేదు. ల్యాబ్‌ విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు’’అని వాపోయారు. ఏదేమైనా విచారణలో అన్ని విషయాలు వెల్లడవుతాయని ధీమా వ్యక్తం చేశారు. కాగా వుహాన్‌లోని ల్యాబ్‌లో పనిచేసే ఇంటర్న్‌ కరోనాపై పరిశోధనలు జరుగుతున్న క్రమంలో అనుకోకుండా వైరస్‌ను లీక్‌ చేశారంటూ అమెరికా మీడియా సంస్థ ఫాక్స్‌ న్యూస్‌ సంచలన కథనం వెలువరించిన విషయం తెలిసిందే. చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నట్లుగా అది మాంసం మార్కెట్ల నుంచి కాకుండా ల్యాబ్‌ నుంచే వ్యాప్తి చెందిందని ఆరోపించింది. (కరోనా: చైనా ‘ఖాతా’లో మరో 1,290 మరణాలు!)

ఇదిలా ఉండగా శాస్త్రవేత్తలు కరోనా జన్యుక్రమంపై ఇంతవరకు అవగాహనకు రాలేకపోయారు. దీంతో టీకా అభివృద్ధి మరింత ఆలస్యం కానుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ది లాన్సెట్‌లో చైనీస్‌ శాస్త్రవేత్తలు ప్రచురించిన జర్నల్‌ ప్రకారం.. కోవిడ్‌-19 పేషెంట్‌కు వుహాన్‌ మార్కెట్‌తో ఎటువంటి సంబంధం లేదని పేర్కొనగా.. షీ జెంగ్లీ అనే మరో శాస్త్రవేత్త గబ్బిలాల ద్వారానే మనిషికి కరోనా సోకిందని తెలిపారు. ఇక లండన్‌ శాస్త్రవేత్తలు మాత్రం ఇంతవరకు ఇందుకు సంబంధించిన ఆధారాలు లభించలేదని.. కరోనా పుట్టుక ఇంకా తమకు సవాలును విసురుతూనే ఉందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు