అడుగు తీసి అడుగేయాలంటే వెన్నులో వణుకే!

17 Jan, 2018 18:56 IST|Sakshi

బీజింగ్‌: ధ.. ధ.. ధైర్యం ఉండాలా.. ఇదేంటి విషయం చెప్పకుండానే ధైర్యం ఉండాలని చెబుతారేంటనుకుంటున్నారా.. అవును చైనాలో ఉన్న ఆకాశాన్ని తాకే రీతిలో నిర్మించిన గాజు వంతెనలపై నడవాలంటే కచ్చితంగా ధైర్యం ఉండాల్సిందే..!  లేదంటే వంతెనపై కొద్ది దూరం నడిచే సరికే పై ప్రాణాలు పైనే పోయినట్టు అనిపించడం ఖాయం. ఇక్కడ ఒక్కో బ్రిడ్జిది ఒక్కో ప్రత్యేకత. సంప్రదాయ అందాలకి తోడు పర్యాటకుల్ని ఆకర్షించేందుకు డ్రాగన్‌ కంట్రీ అనుసరిస్తున్న సరికొత్త పంథా పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది.  

వెనకడుగు వేయాల్సిందే..!
గతేడాది డిసెంబర్‌లో ‘ఫ్లైయింగ్‌ డ్రాగన్‌ ఇన్‌ ద స్కై’ పేరుతో మారెన్‌కిఫెంగ్‌ జాతీయ పార్కులో గ్లాస్‌తో నిర్మించిన  బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది.  అన్హుయి ప్రావిన్స్‌లోని వుహూ పట్టణంలో ఈ స్కై హై నిర్మించారు. ఇది భూమి ఉపరితలం నుంచి 180 మీటర్ల ఎత్తులో వేలాడుతుంది. దీని పొడవు 388 మీటర్లు. ఇలాంటి బ్రిడ్జిలు మరిన్ని గత కొన్నేళ్లలో చైనా అందుబాటులోకి తెచ్చింది. ఓ పక్క అభయారణ్యం, మరో పక్క గాజు వంతెనతో పర్యాటకులకు పండగే పండగ..! పారదర్శకంగా ఉండే ఈ గాజు వంతెన నుంచి కిందకి చూడాలంటే పర్యాటకులకు ఎంతో ధైర్యం ఉండాలి.

ఓవైపు ఆకాశాన్ని తాకే ఎత్తు నుంచి ప్రకృతి అందాల్ని చూడడం.. మరోవైపు కిర్రు కిర్రుమని బ్రిడ్జి పగిలిపోతున్నటు వంటి శబ్దాలతో ఊపిరి సలపని భయం, ఉత్సాహం పర్యాటకులకు కలగక మానదు. దేశీయంగా తయారైన ఫైబర్‌ డ్రాగన్లు వంతెన చివర నుంచి మంటలు కక్కడం చూస్తే ఔరా..! అనాల్సిందే. వంతెనపై నడుస్తున్నప్పుడు మన ప్రతిబింబం కనిపిస్తుంది. మనపై మనం నడుస్తున్నట్టుగా ఉంటుంది.
 
ఇలాంటివి మరెన్నో..
మరో గ్లాస్‌ వంతెనను భూ ఉపరితలం నుంచి 218 మీటర్ల ఎత్తులో రెండు కొండల మధ్య వేలాడదీసినట్లు ఉంటుంది. పింగ్‌షాన్‌ కౌంటీలో నిర్మించిన దీని ఎత్తు 66 అంతస్తుల భవనం కంటే ఎక్కువ. నాలుగు మీటర్ల వెడల్పుతో 488 మీటర్ల మేర వ్యాపించిన ఈ వంతెన పైనుంచి హంగ్యోగు అందాల్ని అంతెత్తునుంచి వీక్షించడం వీనుల విందే కదా.. సెంట్రల్‌  చైనాలోని పర్యాటక ప్రాంతం జాంగ్జియాజిలో 430 మీటర్ల పొడవుతో, ఆరడుగుల వెడల్పుతో మరో గాజు వంతెన నిర్మించారు. దీన్ని 300 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు.  ఇలా ఒకదాన్ని తలదన్నేలా కనిపించేలా మరో గాజు వంతెనలు అన్నీ అద్భుతాలే.

కొండలు, పర్వత ప్రాంతాల్లో అధికం
జియోలాజికల్‌ మ్యూజియం ఆధ్వర్యంలో నడిచే ‘ఎర్త్‌ మేగజైన్‌’ వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 2016 వరకు దాదాపు 60 గాజు వంతెనల నిర్మాణం పూర్తయింది.  2017లో మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. కొండలు, పర్వతాలు ఎక్కువగా ఉండే జియాంగ్జి, హునాన్‌‌, యునాన్‌ వంటి ప్రావిన్స్‌లలో ఈ వంతెనలు ఎక్కువగా దర్శనమిస్తాయి. ఒక్కో ప్రావిన్స్‌లో సరాసరి 5 గాజు వంతెనలు ఉన్నాయి.

మర్చిపోలేని అనుభవం
‘పారదర్శక వంతెనపై నడవడం మర్చిపోలేని అనుభవం. చాలా భయం వేయడంతో పాటు పట్టరాని ఆనందమూ కలిగిందని’ హెఫె ప్రావిన్స్‌ నివాసి లీ జింగ్జియాంగ్‌ అన్నారు.
  అడుగు తీసి అడుగేస్తే నరాల్లో వణుకు పుట్టింది. అడుగుల శబ్దానికి బదులు గాజు పగిలిన చప్పుడు విన్నప్పుడు ఒకింత భయాందోళనకు గురయ్యానని తన అనుభవాన్ని తెలిపారు.

వైరల్‌ వీడియోలు..
బ్రిడ్జి మీద నడవడానికి భయపడుతూ.. ఏడుస్తూ.. ఆశ్చర్యానికి గురయ్యే సందర్భంలో పర్యాటకులు తీసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  సాహసయాత్రలు చేసే వారు సైతం కొన్నిసార్లు వాటిపై నడవడానికి ఇబ్బంది పడుతుండటం గమనార్హం. కొండలు, పర్వతాల మధ్యే కాదు, చాలా ఎత్తులో ఉన్న బండరాళ్లపై కూడా ఈ నిర్మాణాలు చేపడుతుండగా.. సహజత్వానికి విఘాతం కల్గిస్తోందని కొందరు పర్యాటకులు అభిప్రాయ పడుతున్నారు. పర్యాటకుల్ని ఆకర్షించేందుకు కేవలం గాజు వంతెనల్నినిర్మించడంలో తలమునకలు కాకుండా.. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు