చైనా రక్షణమంత్రిగా మిస్సైల్‌ ఎక్స్‌పర్ట్‌!

20 Mar, 2018 02:01 IST|Sakshi
వాంగ్‌ యి

భారత్‌తో చర్చలకు వాంగ్‌ యి

బీజింగ్‌: ప్రపంచంలో చైనాను మరింత శక్తిమంతంగా నిలిపేలా.. సమర్థవంతంగా, సేవా దృక్పథంతో పనిచేసేలా కొత్త మంత్రి వర్గాన్ని చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ ఏర్పాటుచేశారు. నలుగురు ఉప ప్రధానులతో పాటు 26 మంత్రిత్వ శాఖలు, కమిషన్లతో కూడిన కొత్త కేబినెట్‌కు చైనా పార్లమెంటు నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది. భారత్‌ సహా పలు సరిహద్దు దేశాలతో విభేదాల నేపథ్యంలో క్షిపణి రంగ నిపుణుడు లెఫ్టినెంట్‌ జనరల్‌ వై ఫెంఘేను రక్షణ శాఖ మంత్రిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

చైనాలో సైనిక ఆధునికీకరణ, పునర్వ్యవస్థీకరణకు ఆయన కృషి చేశారు. ఇక ఉప ప్రధాని ల్యూ హీ చైనా ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ప్రపంచంలో అమెరికా తర్వాత అతి పెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాలో 30 ఏళ్ల అనంతరం 2016లో వృద్ధి రేటు మందగించింది. చెన్‌ వెన్‌కింగ్‌కు అంతర్గత భద్రత వ్యవహారాలు అప్పగించగా..  సంస్కరణ వాదిగా పేరొందిన యీ గ్యాంగ్‌ పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా గవర్నర్‌గా నియమితులయ్యారు. 15 ఏళ్లుగా గవర్నర్‌గా ఉన్న ఝౌ స్థానంలో గ్యాంగ్‌కు ఈ అవకాశం దక్కింది.

విదేశాంగ మంత్రికి స్టేట్‌ కౌన్సిలర్‌ పదవి
చైనా అత్యున్నత దౌత్య పదవి అయిన స్టేట్‌ కౌన్సిలర్‌గా విదేశాంగ మంత్రి వాంగ్‌ యిను నియమించారు. భారత్‌తో సరిహద్దు వివాదంలో చైనా ప్రతినిధిగా చర్చలకు ఆయన నాయకత్వం వహించనున్నారు. చైనాలో విదేశాంగ మంత్రి కన్నా స్టేట్‌ కౌన్సిలర్‌ పదవి పెద్ద ర్యాంకు. ఇటీవల కాలంలో చైనాలో ఏకకాలంలో రెండు పదవులను నిర్వహిస్తున్న మొదటి వ్యక్తి వాంగ్‌ కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు