కరోనాపై చైనా గెలిచిందిలా..!

23 Mar, 2020 11:11 IST|Sakshi

కరోనాపై పోరాటంలో చైనా విజయం సాధించింది. దాదాపు మూడున్నర నెలల క్రితం వుహాన్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత గత మూడు రోజులుగా వుహాన్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారికంగా ప్రకటించే స్థితికి చేరుకుంది. శనివారం కొత్తగా 46 కేసులు నమోదయినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. గడచిన నాలుగు రోజులతో పోల్చితే కేసులు సంఖ్య పెరిగినా, బాధితుల్లో విదేశాల నుంచి వచ్చినవారే అధికంగా ఉన్నట్టు తెలిపింది. కొత్తగా వైరస్ బారినపడ్డ స్థానికుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు గత మూడు రోజులుగా వెల్లడించిన నివేదికల్లో చైనా తెలిపింది. 

శుక్రవారం 41 కేసులు నమోదు కాగా, వీరంతా విదేశాల నుంచి వచ్చిన చైనా పౌరులే. వుహాన్‌లో ఎటువంటి కొత్త కేసులు నమోదు కాలేదని.. ఇప్పటికే పాజిటివ్‌ ఉన్న వారిలో కూడా కొంత మంది కోలుకొని ఇళ్లకు వెళ్తున్నారని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రకటించింది. చైనా అత్యంత కఠినమైన నిర్ణయాలతో ప్రజల కదలికలను కట్టడి చేస్తూ హుబై ప్రావిన్స్‌లో ఆర్థిక కార్యకలాపాలన్నింటికి చెక్‌ పెట్టి చైనా పాలకులు ఈ విజయం సాధించారు. ఉదాహరణకు, సామాజిక భద్రతా ఫీజులను, వినిమయ ఫీజులను రద్దు చేయడం, ఫిన్‌టెక్‌ సంస్థల ద్వారా వారికి రుణాలు అందించడం వంటి చర్యలు చైనా ప్రభుత్వం తీసుకుంది.

ఇదే సమయంలో చైనాలో కరోనా వైరస్ కారణంగా మరణించిన మృతుల సంఖ్య 3,270కు చేరిందని కమిషన్ పేర్కొంది. మొత్తం 81 వేల మందికి పైగా ఇన్ఫెక్షన్ సోకగా, 72,703 మంది డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 6,013 మందికి చికిత్స కొనసాగుతోందని పేర్కొంది. చైనాలో కరోనా చికిత్సలు అందించిన ఆసుపత్రులను సైతం మూసివేశారు. ఈ నెల 10న వూహాన్‌లో స్వయంగా పర్యటించిన అధ్యక్షుడు జిన్ పింగ్, వైరస్‌ను తాము జయించినట్టేనని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆపై హుబేయ్, వూహాన్ ప్రాంతాల్లో ఆంక్షల సడలింపు ప్రారంభం అయింది. సరిహద్దులను తిరిగి తెరిచి రాకపోకలకు అనుమతించారు. చదవండి: కరోనా అలర్ట్‌ : మూడో దశకు సిద్ధమవ్వండి!

ప్రావిన్స్ పరిధిలోని లోరిస్క్ ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకునేందుకు, పనులకు వెళ్లేందుకు, ప్రజలు బయట తిరిగేందుకూ అనుమతించారు. ఇదే సమయంలో చైనాను మరో భయం కూడా వెన్నాడుతోంది. రెండో సారి కరోనా వ్యాపించే అవకాశాలు కూడా ఉండటమే ఇందుకు కారణం. చైనాకు సరాసరిన రోజుకు 20 వేల మంది వివిధ దేశాల నుంచి వస్తుంటారు. ఇదే చైనా పాలకులకు ఆందోళన కలిగిస్తోంది. బీజింగ్ సహా అన్ని విమానాశ్రయాలకు వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులంతా తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలన్న ఆదేశాలు జారీ చేసి, అందుకోసం కొన్ని హోటల్స్‌ను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చింది. ఇదిలావుండగా.. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షలను దాటగా, మృతుల సంఖ్య 14,688కు చేరుకుంది. 171 దేశాలకు ఈ మహమ్మారి విస్తరించగా, చైనా తరువాత ఇటలీ, ఇరాన్ దేశాలపై పెను ప్రభావాన్ని చూపింది. చైనా గట్టున పడిపోగా, మిగతా దేశాలు ఆ స్థాయిలో ఆంక్షలను అమలు చేయలేకపోతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: మీరే అసలైన హీరో.. కరోనాపై పోరుకు రూ.100కోట్లు

మరిన్ని వార్తలు