చైనా కుయుక్తులకు సాక్ష్యమీ ఫొటోలు!

17 Jun, 2020 15:26 IST|Sakshi
గాల్వన్‌ లోయలో చైనా బలగాలు.. (ఫొటో కర్టెసీ: ఇండియా టుడే)

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో చైనా దుందుడుకు చర్యలను తెలిపే కీలకమైన ఉపగ్రహ ఛాయాచిత్రాలు బయటపడ్డాయి. మిలటరీ అధికారుల చర్చల అనంతరం ఉద్రిక్తతలకు కారణమైన గాల్వన్‌ లోయ నుంచి సైనికులను వెనక్కి రప్పించాలనే ఇరు దేశాల ఒప్పందాన్ని చైనా తుంగలో తొక్కిందని ఇండియా టుడే తన వ్యాసంలో పేర్కొంది. ఘర్షణలకు ముందు, మరుసటి రోజు (మంగళవారం) కూడా డ్రాగన్‌ సైనికులు గాల్వన్‌ లోయ ప్రాంతంలో తిష్ట వేశారని తెలిపింది.

అక్కడ పెద్ద ఎత్తున చైనా బలగాలు, దాదాపు 200లకు పైగా సైనిక వాహనాలు, అనేక గుడారాలు ఉన్నాయని పేర్కొంది. భారత బలగాల కన్నా ఎన్నోరెట్లు ఆ ప్రాంతంలో చైనా దళాలు మోహరించాయని వెల్లడించింది. అంతేకాకుండా.. మూడు భాగాలుగా  చైనా దళాలు వాస్తవాధీన రేఖ వైపునకు చొచ్చుకొస్తున్నట్టు ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో స్పష్టంగా తెలుస్తోందని ఇండియా టుడే  వివరించింది. అదే సమయంలో భారత బలగాలు తమ పరిధిమేరకు నిలిచి ఉన్నాయని తెలిపింది. ఉపగ్రహ చిత్రాలను నిశితంగా పరిశీలిస్తే డ్రాగన్‌ కుయుక్తులు తెలుస్తాయని సూచించింది.
(చదవండి: విషం చిమ్మిన చైనా..)


ఫొటో కర్టెసీ: ఇండియా టుడే

సైనిక బలగాల ఉపసంహరణకు జూన్‌ 6న ఒప్పందం జరగ్గా 10 రోజులు కాకుండానే చైనా దానికి తూట్లు పొడిచిందనేందుకు ఈ ఫొటోలే సాక్ష్యమని ఇండిటు టుడే చెప్పింది. చైనా-భారత బలగాలు తలపడిన ఘటనకు సంబంధించి ఇవే తొలి ఫొటోలని ఆ వార్తా సంస్థ పేర్కొంది. ఇక ఘర్షణల అనంతరం కూడా భారత బలగాలు తమ పరిధిలోనే నిలిచి ఉన్నాయని చెప్పింది. కాగా, గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. మరోవైపు 43 మంది చైనా సైనికులు భారత సైనికుల దాడిలో చనిపోయినట్టు ఆ దేశ మీడియా ప్రకటించింది.(చదవండి: జవాన్ల మధ్య ఘర్షణకి కారణం ఏంటంటే..)

మరిన్ని వార్తలు