రెస్టారెంట్ గా మారిన బోయింగ్ 737..!

3 Aug, 2016 19:24 IST|Sakshi
రెస్టారెంట్ గా మారిన బోయింగ్ 737..!

ఊహాన్: వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకొనేందుకు కొందరు కొత్త కొత్త ఆకర్షణలను ప్రవేశ పెడుతుంటారు. అయితే ఓ వ్యాపారవేత్త మాత్రం తాను అవసరం కొద్దీ చేసిన ప్రయోగం ఆకర్షణీయంగా మారింది. బోయింగ్ 737 విమానాన్ని ఓ వ్యాపారవేత్త రెస్టారెంట్ గా మార్చేశాడు. 'లిల్లీ ఎయిర్వేస్' పేరున మొట్టమొదటిసారి భిన్నంగా ఆవిష్కరించిన ఈ బోయింగ్ విమానం రెస్టారెంట్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది.

చైనాలో మొట్టమొదటిసారి ప్రయోగాత్మకంగా ప్రారంభించిన 'విమానం రెస్టరెంట్' ప్రత్యేకాకకర్షణగా నిలుస్తోంది. వ్యాపారవేత్త లీ లియాంగ్ మే 2015 లో ఇండోనేషియా ఎయిర్లైన్స్ బటావియాకు చెందిన  బోయింగ్ 737 విమానాన్ని కొనుగోలు చేశాడు. అయితే అది.. డీ మౌంటింగ్, పోర్ట్, షిప్పింగ్, బిజినెస్ లైసెన్స్, ట్రేడ్ డిక్లరేషన్  వంటి విధి విధానాలు, కస్టమ్స్ ప్రొసీజర్లు పూర్తి చేసుకొని చైనా చేరేసరికి ఆర్నెల్లకాలం పట్టేసింది. తాను ఒక్కొక్కటిగా పనులు చేయించుకోవడంతో ఆ బోయింగ్ 737 విమానాన్ని ఎనిమిదిసార్లు డిస్అసెంబుల్ చేశారని, ఇండోనేషియా నుంచి అది చైనా లోని ఊహాన్ చేరేసరికి నాలుగు నెలలు పట్టిందని లీ తెలిపాడు. ముక్కలు ముక్కలుగా విడి భాగాలను సుమారు 70 కంటెయినర్లలో షిప్పింగ్ చేశారని, అవి...విడతలు విడతలుగా తనకు చేరేసరికి ఇంచుమించుగా రవాణాఖర్చుతో 452,325 డాలర్ల నుంచీ 5.28 మిలియన్ డాలర్లకు చేరిపోయిందని తెలిపాడు. అయితే ఇప్పుడు తాను స్థాపించిన విమానం రెస్టారెంట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెస్టారెంట్లలో ఒకటిగా మారిందని లీ తెలిపాడు.

ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరికి చైనా చేరిన పాత బోయింగ్ 737 విమానాన్ని లీ.. ఆప్టిక్స్ వ్యాలీ పెడెస్ట్రియన్ వీధిలో రెస్టారెంట్ గా ఏర్పాటు చేశాడు. ఊహాన్ లోనే అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కొత్త హోటల్ ఇప్పుడు ఆసక్తికరమైన ఆహారపదార్థాలతో భోజనప్రియులతోపాటు.. విమాన ప్రియులకు ఆహ్వానం పలుకుతోంది. విమానంలోని క్యాబిన్ ప్రాంతాన్ని రెస్టారెంట్ గా ఏర్పాటుచేసిన లీ... జెట్ ఫ్లైట్ ను నడుపుతున్న అనుభూతి కలిగేలా కాక్ పిట్ ఏరియాను ఫ్లయింగ్ సిమ్యులేటర్ గా మార్చేశాడు. తాను విభిన్నంగా రూపొందించిన  'లిల్లీ ఎయిర్వేస్' (రెస్టారెంట్) లో డిన్నర్ ఖరీదు ఒక్కోరికీ 30 నుంచి 40 డాలర్లు ఉంటుందని, అలాగే కాక్పిట్ సిమ్యులేటర్ వినియోగించాలనుకునే ఔత్సాహికులు  45 నుంచి 60 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్తున్నాడు. అయితే తన కొత్త ప్రయోగంలో  లాభాలు వచ్చేందుకు కొంత సమయం పట్టేట్లు కనిపిస్తోందని సదరు వ్యాపారవేత్త అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా