ఆ బాస్ అద్భుతం!

7 May, 2016 20:19 IST|Sakshi

చైనాః ఒకే సంస్థకు చెందిన వేలమంది సిబ్బంది ఒకేచోట చేరి హాయిగా ఆనందంగా గడపటం చాలా అరుదుగా చూస్తాం. సంవత్సరానికోసారి సెలవు పెట్టి ఎక్కడికైనా నాలుగు రోజులు విహారా యాత్రలకు వెళ్ళే అవకాశం కూడ కంపెనీల్లో పనిచేసే వర్కర్లకు అరుదుగానే ఉంటుంది. అటువంటిది ఆ చైనా కంపెనీ బాస్ మాత్రం తన వర్కర్లను ఎప్పుడూ ఆనందంగా, హాయిగా ఉండేట్లు చూసుకుంటాట్ట. వారి సరదాకోసం ఏకంగా కోట్లకొద్దీ డబ్బును ఖర్చుపెడుతున్నాడట. ఆ వివరాలేమిటో చూద్దాం.

చైనాలోని డైరెక్ట్ మార్కెటింగ్ సంస్థ...అంతర్జాతీయ టైన్స్ గ్రూప్ యజమాని, బిజెనెస్ టైకూన్, లీ జినువాన్ తన సంస్థలో పనిచేసే సిబ్బందిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారట. నిత్యం పనితో సతమతమయ్యే సిబ్బందికి ఆట విడుపుగా సంవత్సరానికోసారి వారిని ఏకంగా విదేశాలకు హాలీడే టూర్ తీసుకెడుతుంటారట. గత సంవత్సరం సుమారు 6,400 మంది సిబ్బందిని  స్వంత ఖర్చులతో ఫ్రాన్స్ కు తీసుకెల్ళిన లీ.. ఈ సారి స్పెయిన్ పర్యటనకు తీసుకెళ్ళారు. ఈ విహార యాత్రకోసం ఆయన ఏకంగా సుమారు 552 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. టైయెన్స్ గ్రూప్ కంపెనీల్లో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న సుమారు 2500 మంది సిబ్బందిని 20 వరకూ అద్దె విమానాల్లో స్పెయిన్ కు తీసుకువెళ్ళిన ఆయన... రాజధాని మాడ్రిడ్ లో బస చేసేందుకు 1650 హోటల్ గదులను, పర్యటించేందుకు 70 ఏసీ బస్సులను ఏర్పాటు చేశారట.

సెల్ఫీ స్టిక్ లతో ఫొటోలు, బుల్ ఫైట్స్, డ్యాన్సింగ్ హంగామాలతో ఆనందంగా ఐదు రోజుల పాటు జరిగే వీరి విహార యాత్రలో భాగంగా మాడ్రిడ్ తో పాటు, బార్సిలోనా, టోలెడో నగరాలను సందర్శించి తిరిగి మే 10వ తేదీ నాటికి చైనా చేరుకుంటారు. కంపెనీ యజమాని కుమారుడు లీ జాంగ్ మిన్ కూడ ఈ యాత్రలో పాల్గొంటున్నారు. కంపెనీ 21వ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి  ఏర్పాటు చేసిన  పర్యటనకు అయ్యే ఖర్చులను పూర్తిగా కంపెనీయే భరిస్తోంది. సిబ్బందిని విదేశీ పర్యటను తిప్పాలన్న ఉద్దేశ్యం కంపెనీలో గతేడాది ప్రారంభమైంది. అప్పట్నుంచీ అదే సంప్రదాయాన్నికొనసాగిస్తూ.. కంపెనీ అధినేత లీ జినువాన్ ఇప్పుడు ప్రపంచంలోనే బెస్ట్ బాస్ అనిపించుకుంటున్నారు. అంతేకాదు చైనా కంపెనీలకు స్ఫూర్తిగా కూడ నిలుస్తున్నారు.  ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా చైనీస్ టైకూన్ లీ ఉద్యోగులను ఉత్సాహంగా ఉంచుతూనే తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రయోగిస్తున్న మార్కెటింగ్ టెక్నిక్ ను అంతా అభినందిస్తున్నారు. సిబ్బందిని అధినేత ట్రీట్ చేస్తున్న విధానాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మరిన్ని వార్తలు