ఆ అరగంట ఆలస్యమై ఉంటే..

11 Jun, 2015 16:23 IST|Sakshi
ఆ అరగంట ఆలస్యమై ఉంటే..

బీజింగ్:  కుప్పకూలిపోతున్న ఏడంతస్తుల భవనం నుంచి 67 మందిని  దంపతులు కాపాడిన వైనం పలువురి ప్రశంసలందుకుంది.  చైనాలోని హుచియాన్ జిల్లాలోని గిజో ప్రావిన్స్లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.  ఆ భవనంలో కింది  అంతస్తులో కిరాణా దుకాణం నిర్వహించే లూ కైసూ, జి యవాన్ కుయీ దంపతులు ఆకస్మాత్తుగా భవనం కూలిపోతున్న విషయాన్ని గమనించారు. క్షణం కూడా ఆలోచించకుండా ఏడో అంతస్తులో ఉంటున్న తమ పిల్లలతో సహా, భవనంలో ఉంటున్న అందర్నీ అప్రమత్తం చేశారు. ఏ ఒక్కరూ  ప్రమాదం బారిన పడకుండా అందర్నీ రక్షించారు. ఆఖరి వ్యక్తి భవనం నుంచి బయటపడిన  దాదాపు అర్థగంట తరువాత  ఏడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది.

''అర్థరాత్రి ఆకస్మాత్తుగా గ్లాస్ పగిలిన శబ్దం వినిపించింది. ఇది దొంగల పని అనుకొని మా ఆయన్ను చూడమన్నాను. అనుమానాస్పదంగా ఏమీ కనపించలేదు. పోయి పడుకున్నాం.. కానీ తెల్లవారుజామున పెద్ద శబ్దం వినిపించింది. అప్పుడు వెళ్లి చూస్తే...  భవనానికి పగుళ్లు! ఒక్కసారిగా సిమెంట్, ఇసుక  రాలిపోతున్నాయి. అంతే, గడప గడపకూ వెళ్లి...'' అంటూ ఆనాటి  సంఘటననూ పూసగుచ్చినట్టు వివరించారు లూ కైసూ.

ఈ ప్రమాదంలో రూ. 10 లక్షల విలువ చేసే తమ దుకాణం మొత్తం నాశనమైందని లూ కైసూ భర్త జి యవాన్ కుయీ చెప్పారు. తామంతా భయంతో వణికిపోయామని, కళ్లముందే భవనం పడిపోతోంటే.. నేల మీద అలా కూర్చుండిపోయామని తెలిపారు. తమ ప్రాణాలను కాపాడిన 'లూ' దంపతులకు ఇరుగుపొరుగువారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణం కన్నా విలువైన ఆస్తి ఏముంటుందన్నారు మరో నైబర్ యాంగ్ బింగ్ .

ఇది 1995 లో నిర్మించిన భవనమని, నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఉన్న దాని కంటే నాలుగు అంతస్తులు అదనంగా నిర్మించినట్టు తమ  ప్రాథమిక విచారణలో తేలిందని స్థానిక అధికారులు తెలిపారు. నాసిరకం మెటీరియల్ వాడటంతో ఇటీవల కురిసిన వర్షాలకు కుప్పకూలిపోయిందన్నారు.  భవన యజమానిని అదుపులోకి తీసుకున్నామన్నారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతుందని  తెలిపారు.

>
మరిన్ని వార్తలు