తగ్గుతున్న కోవిడ్‌ కేసులు

21 Feb, 2020 03:54 IST|Sakshi

కోవిడ్‌ మరణాలు 2వేల పైనే

74,576 మందిలో వైరస్‌

బీజింగ్‌: కోవిడ్‌–19 విలయం చైనాలో కొనసాగుతూనే ఉంది. ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకూ ఈ మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 74,576కు చేరుకోగా మొత్తం 2,118 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఒక్కరోజే 114 మంది కోవిడ్‌కు బలయ్యారని చైనా ఆరోగ్యశాఖ అధికారులు గురువారం తెలిపారు. హుబేలో కొత్త కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతోందని అదే సమయంలో చికిత్స తరువాత ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అవుతున్న వారి సంఖ్య వ్యాధిబారిన పడుతున్న వారి కంటే ఎక్కువగా ఉండటం గమనార్హమని అధికారులు చెప్పారు. కోవిడ్‌ కారణంగా దక్షిణ కొరియాలో తొలి మరణం నమోదైంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం నివారణ చర్యలకు దిగింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మతపరమైన ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో గుమికూడరాదని డీగూ నగర మేయర్‌ 25 లక్షల మందికి హెచ్చరికలు జారీ చేశారు.

హాంగ్‌కాంగ్‌ తిరిగి వచ్చిన ప్రయాణీకులు: జపాన్‌ తీరంలో లంగరేసిన డైమండ్‌ ప్రిన్సెస్‌ క్రూయిజ్‌షిప్‌లోని ప్రయాణీకుల్లో వందమంది గురువారం హాంకాంగ్‌ చేరుకున్నారు. ప్రత్యేక విమానం ద్వారా వచ్చిన వీరంతా హాంగ్‌కాంగ్‌ ప్రాంతానికి చెందినవారే. క్రూయిజ్‌షిప్‌లో మొత్తం 3,711 మంది ప్రయాణీకులు ఉండగా వీరిలో సుమారు 500 మందికి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. హాంకాంగ్‌ చేరుకున్న 106 మంది ప్రయాణీకులను ప్రభుత్వ ఆసుపత్రిల్లో పర్యవేక్షణలో ఉంచారు.

మరిన్ని వార్తలు