వైరల్‌ : ఆపరేషన్‌ థియేటర్‌లో కునుకు తీసిన డాక్టర్‌

31 Aug, 2019 20:51 IST|Sakshi

బీజింగ్‌ : ‘వైద్యో నారాయణో హరి’ అనే నానుడికి చైనాలోని ఓ డాక్టర్‌ సాక్ష్యంగా నిలిచారు. విరామమే లేకుండా ఏకధాటిగా 10 ఆపరేషన్లు చేసి రోగుల పాలిట దేవుడయ్యాడు. ఇక పనిపట్ల అతని శ్రద్ధని పేర్కొంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫొటో వైరల్‌ అయింది. సౌత్‌ చైనాలోని లంగాంగ్‌ సెంట్రల్‌ హాస్పిటల్‌ (ఆర్థోపెడిక్‌)లో డాక్టర్‌ డైయూ అతని బృందం గత సోమవారం 13 గంటలపాటు పనిచేసి 10 ఆపరేషన్లు చేసింది. అయితే, డాక్టర్‌ డైయూ విరామమే లేకుండా పనిచేశాడు. ఉదయం 8 గంటలకు ఆపరేషన్‌ థియేటర్‌లోకి అడుగుపెట్టిన అతను సాయంత్రం అయిందింటి వరకు 7 ఆపరేషన్లు చేశాడు. అప్పటికీ అతను నిముషం కూడా విశ్రాంతి తీసుకోలేదు.

ఇక 8వ సర్జరీ సమయంలో పేషంట్‌కు అనస్థీషియా ఇవ్వడంలో కాస్త ఆలస్యమైంది. దాంతో డైయూకి ఓ 10 నిముషాలు సమయం దొరకడంతో థియేటర్‌లోని ఫ్లోర్‌పై ఓ మూలకు కూర్చుని కునుకు తీశాడు. డాక్టర్‌ వృత్తి ధర్మానికి ముగ్థుడైన సిబ్బందిలో ఒకరు అతను కునుకుతీస్తున్నప్పుడ ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో డాక్టర్‌పై సేవలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సెల్యూట్‌ సర్‌.. మీ సేవలకు కృతజ్ఞతలు అని ఒకరు, చైనా డాక్టర్లు ఎప్పుడూ బెస్టే అని మరొకరు కామెంట్లు చేశారు. ‘ఆస్పత్రి బెడ్‌పై కదల్లేని స్థితిలో ఉన్నా. అయినా సరే.. డాక్టర్‌ డైయూని కలిసి థాంక్స్‌ చెప్పాలని ఉంది’అని ఓ పేషంట్‌ కామెంట్‌ చేశాడు. రోగులకు సత్వర చికిత్సను అందించడం తన కర్తవ్యమని డాక్టర్‌ డైయూ చెప్పడం విశేషం.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు