కోవిడ్‌కు వైద్యుడు బలి

19 Feb, 2020 03:18 IST|Sakshi

చైనాలో 1,800 దాటిన మృతులు..

మరో 72,436 మందికి వ్యాధి

బీజింగ్‌/టోక్యో/న్యూఢిల్లీ: కోవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న వుహాన్‌ నగరంలో మరో వైద్యుడు చనిపోయారు. మంగళవారం నాటికి ఈ వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 1,868కు, బాధితుల సంఖ్య 72,436కు చేరిందని యంత్రాంగం తెలిపింది. కోవిడ్‌పై మొదటిసారిగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు యత్నించిన వుహాన్‌ సెంట్రల్‌ ఆస్పత్రి ఆఫ్తల్మాలజిస్ట్‌ లి వెన్‌లియాంగ్‌ సహా ఆరుగురు వైద్య సిబ్బంది కోవిడ్‌తో చనిపోయినట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 1,700 మంది సిబ్బందికి వ్యాధి లక్షణాలు బయటపడినట్లు కూడా వెల్లడించింది.

తాజాగా వుహాన్‌ వుచాంగ్‌ ఆస్పత్రి హెడ్, న్యూరో సర్జన్‌ డాక్టర్‌ లియు ఝిమింగ్‌ ఈ వైరస్‌ కారణంగానే మృతి చెందారని అధికార మీడియా ధ్రువీకరించింది. వుహాన్‌లో ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు అన్నారు. వ్యాధి బయటపడిన మొదట్లో అవగాహన లోపం కారణంగానే వైద్య సిబ్బందికి వైరస్‌ సోకిందని నిపుణులు అంటున్నారు. వ్యాధి తీవ్రతను బయటకు తెలియకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం కూడా ఇందుకు తోడైందని భావిస్తున్నారు. అయితే, చైనా కొత్త ఏడాది సెలవులను ముగించుకుని తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు నగరాలకు వచ్చే వారికి కోవిడ్‌ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఓడలో ఆరుగురు భారతీయులకు కోవిడ్‌
కోవిడ్‌ భయంతో జపాన్‌ రాజధాని టోక్యో తీరంలో నిలిపేసిన డైమండ్‌ ప్రిన్సెస్‌ ఓడలో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఓడలోని 3,711 మందిలో సోమవారం నాటికి 542 మందికి కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణయిందని అధికారులు తెలిపారు. బాధితుల్లో ఆరుగురు భారతీయులు ఉన్నారని, వీరి పరిస్థితి మెరుగవుతోందని పేర్కొన్నారు. కోవిడ్‌ మహమ్మారిపై పోరాటంలో చైనా విజయం సాధిస్తుందని భారత్‌లో ఆ దేశ రాయబారి సున్‌ వీన్‌డాంగ్‌ అన్నారు.

వుహాన్‌కు ప్రత్యేక విమానం 
వుహాన్‌కు 20వ తేదీన ప్రత్యేక విమానాన్ని పంపనున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. సీ–17 రకం భారీ సైనిక విమానంలో చై నాకు మందులు, ఇతర వైద్య సామగ్రిని తీసుకెళ్తామని, తిరుగు ప్రయాణంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువస్తామని సై నిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు ప్రభు త్వం వుహాన్‌ సహా హబే ప్రావిన్స్‌ నుంచి 640 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది. హుబే ప్రావిన్స్‌లో ఇంకా 100 మంది వరకు భారతీయులున్నట్లు అధికారులు తెలిపారు.

టాయిలెట్‌ పేపర్ల చోరీ
కోవిడ్‌ భయంతో జపాన్‌లో మాస్కులకు డిమాండ్‌ పెరిగిపోయింది. దుకాణాల్లో మాస్కుల కొరత ఏర్పడింది. దీంతో 65 మాస్కులుండే ఒక్కో బాక్స్‌ రూ.32 వేల వరకు ధర పలుకుతోంది. సోమవారం కోబె నగరంలోని రెడ్‌క్రాస్‌ ఆస్పత్రిలో 6 వేల మాస్కులున్న బాక్సులను దొంగలు మాయం చేశారు. హాంకాంగ్‌లోనూ మాస్కులు, టాయిలెట్‌ పేపర్‌ కొరత ఏర్పడింది. టాయిలెట్‌ పేపర్‌ లోడుతో వెళ్తున్న వాహనాన్ని కొందరు దుండగులు అడ్డగించి అందులోని సరుకునంతా లూటీ చేశారు.

మరిన్ని వార్తలు