చైనా విదేశాంగశాఖ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

8 Mar, 2018 17:45 IST|Sakshi

బీజింగ్‌ : చైనీస్‌ డ్రాగన్‌, ఇండియన్‌ ఎలిఫెంట్‌ కలిసి డాన్స్‌ చేయాలే తప్ప కొట్టుకోకూడదని చైనా-భారత్‌ సంబంధాల గురించి చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యీ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య తలెత్తిన విబేధాలు సమసిపోవాలంటే సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అపుడే ద్వైపాక్షిక ఒప్పందాల అమలు జరుగుతుందన్నారు. పార్లమెంట్‌ సెషన్‌లో భాగంగా నిర్వహించిన పత్రికా సమావేశంలో పాల్గొన్న వాంగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

గత సంవత్సర కాలంగా ఇరుదేశాల మధ్య నెలకొన్న విభేదాల గురించి ప్రశ్నించగా... డోక్లాం వివాదం వంటి కొన్నిఅంశాల కారణంగా విభేదాలు తలెత్తినప్పటికీ, చైనా- భారత్‌ తమ సంబంధాలు మెరుగుపరచుకునేందుకు కృషి చేస్తున్నాయన్నారు. చైనా తన హక్కులు కాపాడుకునేందుకు చట్టబద్ధంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతుందన్నారు. చైనా-భారత్‌ కలిసి పనిచేస్తే ఒకటి ఒకటి కూడితే రెండు కాదు.. పదకొండు అవుతుందని చమత్కరించారు. తమ మధ్య ఉన్న స్నేహానికి హిమాలయాలు కూడా అడ్డుగా నిలవలేవని వ్యాఖ్యానించారు. గతంలో నెలకొన్న ఘర్షణలు, విభేదాలు మరచిపోయి ఇరు దేశాలు అనుమానాలకు బదులు, నమ్మకాన్ని పెంపొందించుకుని.. సహకారం అందించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా అనుసరిస్తున్న విధానాలు చైనా బెల్ట్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ పై ప్రభావం చూపిస్తుందా అన్న ప్రశ్నకు సమాధామివ్వడానికి నిరాకరించారు. బెల్ట్‌ రోడ్‌ అంశానికి సుమారు 100 దేశాలు మద్దతునిచ్చాయని, అయినప్పటికీ ఈ విషయమై మీడియా అత్యుత్సాహం చూపిస్తోందని విమర్శించారు. ఆసియా దేశాలు, ఆఫ్రికా, చైనా, యూరప్‌ల మధ్య అనుసంధానానికి ఉద్దేశించిన ఈ నిర్మాణాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారన్నారు. కాగా ఈ నిర్మాణంతో, చైనా-పాక్‌ ఎకనమిక్‌ కారిడార్‌ అనుసంధానమై ఉండటంతో భారత్‌ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ గుండా నిర్మిస్తున్న చైనా- పాక్‌ ఎకనమిక్‌ కారిడార్‌, జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలంటూ ఐక్యరాజ్య సమితిలో వ్యక్తమైన అభిప్రాయాలను చైనా వ్యతిరేకించడం, అణు సరఫరాదారుల బృందంలో భారత్‌ చేరకుండా అడ్డుపడటం వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. గతేడాది 73 రోజులపాటు భారత్‌- చైనాలు డోక్లాం కోసం బలగాలు మొహరించాయి. పలు చర్చల అనంతరం ఆగస్ట్‌ 28 తర్వాత చైనా తన సైన్యాన్ని ఉపసంహరించుకుని, అక్రమంగా చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు