ఓలి కోసం రంగంలోకి దిగిన చైనా

7 Jul, 2020 18:26 IST|Sakshi

నేపాలీ రాజకీయ నాయకులతో చైనా రాయబారి సమావేశం

ఖాట్మండూ: నేపాల్‌లో ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామాపై అస్పష్టత కొనసాగుతూనే ఉంది. ప్రధాని రాజీనామా చేయాలని సొంత పార్టీ నాయకులే డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓలి తన ప్రధాన ప్రత్యర్థి, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండతో వరుసగా సమావేశం అయినా లాభం లేకుండా పోయింది. అసంతృప్తి నేతలెవ్వరూ దారికి రావడం లేదు. మరోవైపు ఓలి ప్రభుత్వాన్ని కాపాడటానికి చైనా కూడా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో చైనా రాయబారి హౌ యాంకి తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గ‌త ఏప్రిల్ నుంచి ఎన్‌సీపీలో అంత‌ర్గ‌తంగా ర‌గులుతున్న వివాదాన్ని చల్లర్చడం కోసం చైనా రాయబారి హౌ యాంకి ప‌లువురు నేపాలీ రాజ‌కీయ నాయ‌కుల‌తో స‌మావేశ‌మై చ‌ర్చ‌లు జ‌రిపారు. గ‌త వారం రోజుల వ్య‌వ‌ధిలో కూడా చైనా రాయ‌బారి హౌ యాంకి ప‌లువురు నేపాల్ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. జూలై 3న‌ నేపాల్ అధ్య‌క్షురాలు విద్యాదేవి భండారిని క‌లిశారు. అయితే అది మ‌ర్యాద‌పూర్వ‌క భేటీ మాత్ర‌మే అని చెప్పారు. హౌ యాంకి, ప్రచండల మధ్య సమావేశం గురించి ఇంకా స్పష్టత రాలేదు. పీఎం ఓలికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న ప్రచండ, హౌ యాంకి కలవడానికి ఇష్టపడరని సమాచారం. ఇదిలా ఉండగా చైనా రాయబార కార్యాలయం హౌ యాంకి సమావేశాలను సమర్థించింది. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొవడం చైనాకు ఇష్టం లేదని తెలిపింది. నేపాల్‌ నాయకులు తమ విభేదాలను పరిష్కరించుకుని ఐక్యంగా ఉండాలని చైనా కోరుకుంటున్నట్లు ఆ దేశ ఎంబసీ ప్రతినిధి ఒకరు మీడియాతో చెప్పారు.(భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు.. నేపాల్‌ ప్రధానికి షాక్‌)

నేపాల్‌లో ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలి ప‌రిపాల‌న స‌రిగా లేదని, ఆయ‌న త‌క్ష‌ణ‌మే ప‌ద‌వి నుంచి వైదొల‌గాల‌ని ఎన్‌సీపీ ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్ ప్ర‌చండ నేతృత్వంలో అస‌మ్మ‌తి వెల్లువెత్తుతున్న‌ సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలాఖ‌రు నుంచి అంత‌ర్గ‌తంగా కొన‌సాగుతున్న ఈ వివాదం గురించి హౌ యాంకికి పూర్తిగా తెలుసు. ఈ నేపథ్యంలో నేపాల్‌లోని క‌మ్యూనిస్టు నాయ‌కుల‌నంతా ఏక‌తాటిపైకి తేవడంలో చైనా కీల‌కపాత్ర పోషించి ఉంటుంద‌ని.. అందుకే ఇప్పుడు అధికార పార్టీలో అస‌మ్మ‌తిని త‌గ్గించేంద‌కు ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.(భారత్‌-నేపాల్‌ వివాదం.. కీలక పరిణామం)

మరిన్ని వార్తలు