అమెరికాలో రాజకీయ వైరస్‌ వ్యాపిస్తోంది

25 May, 2020 02:26 IST|Sakshi

అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడిన చైనా

బీజింగ్‌: అమెరికా, చైనా మధ్య సంబంధాలు రోజు రోజుకి క్షీణిస్తున్నట్టే కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ పుట్టుకపై అసత్యాలు ప్రచారం చేస్తూ ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బ తీయడానికి అమెరికా ప్రయత్నిస్తోందని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ ఆరోపించారు. నేషనల్‌ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌పీసీ) వార్షిక సమావేశాల సందర్భంగా ఆదివారం వాంగ్‌ వీడియో ద్వారా మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై నిజాలు నిగ్గు తీయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అమెరికా, చైనా మధ్య సంబంధాలను దెబ్బ తీయడానికి అమెరికాలో కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయని, రెండు దేశాలను కోల్డ్‌ వార్‌ దిశగా నెట్టేయాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు.

‘‘ఈ పొలిటికల్‌ వైరస్‌ ప్రతీ దానికి చైనాను వేలెత్తి చూపిస్తోంది. చైనాను దుయ్యబట్టడానికి వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటోంది. కొంత మంది రాజకీయ నాయకులు వాస్తవాలను చూడడానికి ఇష్టపడడం లేదు. వాస్తవాలను వక్రీకరిస్తూ మా దేశాన్ని టార్గెట్‌ చేస్తూ నిందలు మోపుతున్నారు. ఎన్నో కుట్రలు పన్నుతున్నారు’’అని యాంగ్‌ అన్నారు. కరోనా వైరస్‌ పుట్టుక, హాంగ్‌కాంగ్‌ స్వతంత్ర ప్రతిపత్తి దెబ్బతీసేలా చైనా పార్లమెంటులో బిల్లు పెట్టడం, వాణిజ్య ఒప్పందాల రగడ, మానవహక్కులు వంటి అంశాల్లో అమెరికా అ«ధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై మాటల దాడిని పెంచిన నేపథ్యంలోనే వాంగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.  

బాధితుల్ని బ్లాక్‌ మెయిల్‌ చేస్తారా ?  
మిగిలిన దేశాల మాదిరిగానే తాము కూడా కరోనా వైరస్‌ బాధితులమేనన్న వాంగ్‌ చైనా నుంచి నష్టపరిహారాన్ని కోరుతూ అమెరికా కోర్టుల్లో దావాలు వేయడాన్ని తప్పు పట్టారు. అమెరికా తప్పుడు ఆధారాలతో బాధితుల్ని బ్లాక్‌ మెయిల్‌ చేస్తోందని మండిపడ్డారు. కరోనా వైరస్‌ అమెరికాలో విధ్వంసం సృష్టిస్తుంటే, మరోవైపు పొలిటికల్‌ వైరస్‌ కూడా దేశమంతా వ్యాపించిందని ఆయన విమర్శించారు. ఇది ఇరు దేశాలకు మంచిది కాదని హితవు పలికారు. కరోనా ఉమ్మడి శత్రువన్న వాంగ్‌ వైరస్‌పై తాము అమెరికాతో కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రపంచ దేశాలు విపత్తులో ఉన్న వేళ సమయాన్ని వృథా చేయకూడదని హితవు పలికారు. అమెరికా, చైనా కలసికట్టుగా తమ వ్యూహాలను పంచుకుంటూ కరోనాపై పోరాడాలని సూచించారు.  

>
మరిన్ని వార్తలు