నాడు లెక్కల టీచర్‌.. నేడు బిలియనీర్‌

21 Apr, 2018 20:25 IST|Sakshi

ఈ రోజుల్లో చదువు ఎంతటి లాభదాయక వ్యాపారమో అందరికీ తెలిసిన విషయమే. కోచింగ్‌ల పేరుతో తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్షల రూపాయల డబ్బు వసూలు చేసి ధనవంతులైన వారిని నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ కోచింగ్‌ సెంటర్‌లో ట్యూషన్‌లు చెప్తూ కోటీశ్వరుడు అవ్వడమే కాక సంపన్నుల జాబితాలో చేరిన వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తే చైనాకు చెందిన లియు యాచావో. చైనాలో ప్రసిద్ధి చెందిన ‘టాల్‌’ కోచింగ్‌ సెంటర్‌కు ముఖ్య అధికారి యాచావో. ఈ కోచింగ్‌ సెంటర్‌లో ఒకటి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు ట్యూషన్‌లు చెప్తారు.

లియు 2003లో పెకింగ్‌ యూనివర్సిటీలో మెకానిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. 2008లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెకానిక్స్‌ ఆఫ్‌ ద చైనీస్‌ అకాడమీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందాడు. అనంతరం ఈ కోచింగ్‌ సెంటర్‌లో లెక్కల టీచర్ గా చేరాడు. తర్వాత వైస్‌ ప్రెసిడెంట్‌గా, డైరెక్టర్‌గా ఎదుగుతూ ప్రస్తుతం ముఖ్య అధికారి స్థాయికి వచ్చాడు. తనను బిలియనీర్‌ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశాడు లియు. చైనాలో తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం ఏడాదికి 42,892 డాలర్లను ఖర్చు చేస్తారు. వారిలో 90శాతం కంటే ఎక్కువ మంది ప్రైవేట్‌ ట్యూషన్‌ల కోసమే ఖర్చు చేస్తున్నారు. చైనాలో ఈ కోచింగ్‌ సెంటర్ల మార్కెట్‌ ఏ విధంగా ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రసుతం ఈ మార్కెట్‌ విలువ 21.1 బిలియన్‌ డాలర్లు.

టాల్‌ కోచింగ్‌ సెంటర్‌, దాని అనుబంధ సంస్థల్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకూ పిల్లలకు గణితంతో పాటు భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, చరిత్ర, భూగోళశాస్త్రం, రాజకీయం సబ్జెక్టులు.. ఇంగ్లీష్‌, చైనీస్‌ భాషలు నేర్పిస్తారు.

మరిన్ని వార్తలు