భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన చైనా మీడియా

13 Aug, 2018 20:51 IST|Sakshi
మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్‌ యమీన్‌ గయూమ్‌- భారత ప్రధాని నరేంద్ర మోదీ (పాత ఫొటో)

బీజింగ్‌ : దౌత్యపరంగా భారత్‌ అనుసరిస్తున్న విధానాలను ప్రస్తావిస్తూ చైనా మీడియా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. ఇరుగుపొరుగు దేశాలపై ఆధిపత్యం చెలాయించడానికి తహతహలాడటం అంత మంచిది కాదంటూ గురవింద చందంగా నీతులు బోధించేందుకు మరోమారు సిద్ధమైంది. మిత్రబంధానికి నిదర్శనంగా ఇచ్చిన హెలికాప్టర్లను,  సాయంగా పంపిన ఆర్మీ సిబ్బందిని వెనక్కి తీసుకోవాలంటూ మాల్దీవులు ప్రభుత్వం భారత్‌ను కోరిన విషయం తెలిసిందే. సముద్ర తలంపై నిఘా, తప్పిపోయిన నౌకలను వెతికేందుకు హెలికాప్టర్లను అందించే ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటున్నట్లు కూడా భారత్‌లో మాల్దీవుల రాయబారి అహ్మద్‌ మహ్మద్‌ స్పష్టం చేశారు. అయితే భారత్‌తో మాల్దీవుల ప్రభుత్వం ఇలా వ్యవహరించడానికి కారణం చైనానే అనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తన సంపాదకీయంలో పేర్కొన్న అంశాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాయి.

గ్లోబల్‌ టైమ్స్‌ కథనం ప్రకారం..
‘ఒక సార్వభౌమ దేశంగా ఏయే దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకోవాలో నిర్ణయించుకునే హక్కు మాల్దీవులకు ఉంది. తమపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న భారత్‌ ప్రభావం నుంచి బయటపడాలని, అలాగే తమకు సాయంగా నిలిచే దేశాలతో దౌత్యపరంగా మెరుగైన సంబంధాలు ఏర్పరచుకోవాలని చూస్తోంది. ‘స్పియర్స్‌ ఆఫ్‌ ఇన్ల్పూయెన్స్‌’  నుంచి విముక్తి పొందాలని ఆ దేశం భావిస్తోంది. చైనా కూడా ‘స్పియర్స్‌ ఆఫ్‌ ఇన్ల్పూయెన్స్‌’ వంటి భావనలకు వ్యతిరేకం. అందుకే ఆ దేశానికి సహకరిస్తూ వివిధ ప్రాజెక్టుల్లో వారితో భాగస్వామ్యమవుతోంది.  ఈ విషయంలో ఎవరూ ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదంటూ’ గ్లోబల్‌ టైమ్స్‌ ‍కథనాన్ని వెలువరించింది.

కాగా భారత నౌకా రవాణాకు అత్యంత కీలకమైన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని మాల్దీవులతో 2011 వరకు భారత్‌కు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అయితే 2012లో నాటి అధ్యక్షుడు నషీద్‌ ప్రభుత్వాన్ని పోలీసు, సైనిక తిరుగుబాటులో కూల్చివేసి అబ్దుల్లా యమీన్‌ అధ్యక్షుడయ్యాక మాల్దీవుల్లో చైనా పలుకుబడి, వ్యాపారం విపరీతంగా పెరిగాయి. రాజధాని మాలేలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించడానికి భారత కంపెనీ జీఎంఆర్‌కు ఇచ్చిన కాంట్రాక్టును కూడా యమీన్‌ సర్కారు రద్దు చేసింది. అదే విధంగా పాకిస్తాన్‌తో కూడా కొత్త కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటూ భారత్‌ను క్రమంగా దూరంగా పెడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మాల్దీవులతో మళ్లీ సఖ్యత కుదుర్చుకునేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.
చదవండి : చైనాపై మోజు... భారత్‌కు షాక్‌!

మరిన్ని వార్తలు