చైనాలో జీన్‌ ఎడిటింగ్‌తో జననం!

27 Nov, 2018 05:02 IST|Sakshi
గాజుపాత్రలో జన్యు మార్పులు చేసిన పిండాలు

ఇద్దరు చిన్నారులు పుట్టారన్న పరిశోధకులు

వినాశనం తప్పదని హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు

హాంగ్‌కాంగ్‌: చైనాలోని షెంజెన్‌కు చెందిన పరిశోధకుడు హే జియాంకుయ్‌ సంచలన ప్రకటన చేశారు. తాను మానవ పిండాల్లో జీన్‌ ఎడిటింగ్‌ చేపట్టాననీ, తద్వారా ఈ నెలలో ఇద్దరు చిన్నారులు జన్మించారని బాంబు పేల్చారు. ఈ పరిశోధనలో అమెరికాకు చెందిన శాస్త్రవేత్త డా.మైకెల్‌ డీమ్‌ పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా మనుషుల డీఎన్‌ఏలోని వ్యాధికారక జన్యువులను తొలగించి, ఆరోగ్యకరమైన జన్యవులను చేర్చుకోవచ్చు.

తద్వారా భవిష్యత్‌ తరాలకు అస్సలు ఎలాంటి వ్యాధులు రాకుండా చేసుకోవచ్చు. అంతేకాదు.. తమ కుమారుడు లేదా కుమార్తె జుట్టు రంగు, ఎత్తు, శరీర ఛాయ, ఎలా ఉండాలో పిండం దశలోనే నిర్ణయించవచ్చు. అయితే ఈ ప్రక్రియను ఎవరైనా దుర్వినియోగం చేసి రోగాలు, అలసట, ముసలితనం, చావు అంటూలేని శక్తిమంతమైన మనుషులను తయారుచేస్తే మానవజాతి మొత్తం అంతరించిపోతుందన్న భయంతో అమెరికా, చైనా సహా పలు ప్రపంచదేశాలు జీన్‌ ఎడిటింగ్‌ను నిషేధించాయి. అయితే చైనాలో పిండాల్లో జీన్‌ ఎడిటింగ్‌ చేయడంపై ఎలాంటి నిషేధం లేదు.

హెచ్‌ఐవీ దంపతుల ఎంపిక
తాజాగా ఈ విషయమై జియాంకుయ్‌ మాట్లాడుతూ.. ఈ ప్రయోగం కోసం హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ సోకిన దంపతులను ఎంపిక చేసుకున్నామని తెలిపారు. ఫలదీకరణం తర్వాత మూడు నుంచి 5 రోజుల వయసున్న పిండాలను ఎడిట్‌ చేసి ఎయిడ్స్‌ సోకేందుకు కారణమయ్యే సీసీఆర్‌5 అనే ప్రొటీన్‌ను పిండాల నుంచి తొలగించామని వెల్లడించారు. ఈ ప్రక్రియను ముందుగా ఎలుకలు, కోతులపై పరీక్షించాకే మనుషుల్లో చేపట్టామన్నారు. పుట్టిన ఇద్దరు బాలికల్లో ఒకరిలో మార్పిడి చేసిన రెండు జన్యువులు ఉండగా, మరో చిన్నారిలో ఒకే జన్యువు ఉందన్నారు.

హాంకాంగ్‌లో మంగళవారం జీన్‌ ఎడిటింగ్‌ సదస్సు నేపథ్యంలో జియాంకుయ్‌ చేసిన ఈ ప్రకటన ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ ప్రయోగం మానవాళికి వినాశకరంగా మారుతుందనీ, సమాజంలో నైతిక విలువలు పడిపోతాయని చాలామంది శాస్త్రవేత్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యాధి నిరోధక లక్షణాలు భవిష్యత్‌ తరాలకు వారసత్వంగా సంక్రమిస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, మరికొందరు ఈ మొత్తం ప్రక్రియపైనే సందేహాలు వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు