పసిఫిక్‌లో కూలిన స్కైలాబ్‌

3 Apr, 2018 02:17 IST|Sakshi

ఎక్కడా దుర్ఘటనలు జరగలేదన్న అధికారులు

బీజింగ్‌: చైనాకు చెందిన అంతరిక్ష ప్రయోగ కేంద్రం టియాంగంగ్‌–1 పసిఫిక్‌ మహా సముద్రంలో కూలిపోయింది. సోమవారం ఉదయం 5.45 గంటలకు (భారత కాలమానం) టియాంగంగ్‌–1 దక్షిణ పసిఫిక్‌ మహా సముద్రంలో కూలినట్లు చైనా అధికారులు వెల్లడించారు. టియాంగంగ్‌ వల్ల ఎక్కడా, ఎవ్వరికీ హాని జరగలేదనీ, భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే వేడికి దాదాపుగా దగ్ధమైపోయినట్లు చైనాలోని మ్యాన్డ్‌ స్పేస్‌ ఇంజనీరింగ్‌ ఆఫీస్‌ తెలిపింది.

సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న ఆలోచనలో భాగంగా చైనా టియాంగంగ్‌–1ను 2011 సెప్టెంబరులో అంతరిక్షంలోకి పంపింది. దీని జీవితకాలం రెండేళ్లు ఉండేలా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మొత్తం ఆరుగురు వ్యోమగాములు (ఇద్దరు స్త్రీలు, నలుగురు పురుషులు) అంతరిక్షంలో టియాంగంగ్‌లో పనిచేశారు. 2013 కల్లా ఇది తన ప్రధాన పనులను పూర్తి చేసినప్పటికీ టియాంగంగ్‌ సేవలను చైనా పొడిగించుకుంటూ వెళ్లింది. అయితే 2016లో ఇది పూర్తిగా పనిచేయడం మానేసి, నియంత్రణను కోల్పోయి కక్ష్య నుంచి పక్కకు జరగడం ప్రారంభించింది.

చివరకు సోమవారం మళ్లీ భూ వాతావరణంలోకి ప్రవేశించి సముద్రంలో కూలిపోయింది. ‘మా దగ్గర ఉన్న సమాచారం మేరకు టియాంగంగ్‌ కూలడం వల్ల భూమిపై ఎక్కడా ఎలాంటి హానీ జరగలేదు. 8 టన్నుల బరువు, 10.4 మీటర్ల పొడవున్న టియాంగంగ్‌ ఆకాశంలోనే చాలా వరకు కాలిపోయింది. అది చైనా చరిత్రలో నిలిచిపోతుంది. అంతరిక్ష కేంద్రంలో పరిశోధనల గురించి ఇది మాకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చింది’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్‌ షువాంగ్‌ చెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా