బిడ్డ కోసం.. ఓ తల్లి ప్రాణత్యాగం!!

12 Dec, 2014 20:21 IST|Sakshi
బిడ్డ కోసం.. ఓ తల్లి ప్రాణత్యాగం!!

ఇది ఓ అమ్మ మాత్రమే చేయగలిగిన త్యాగం.. తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ బిడ్డను క్షేమంగా ఈ ప్రపంచంలోకి తెచ్చింది.. కొన్నాళ్లకే కేన్సర్ మహమ్మారి ఆమె ప్రాణాలు తీసుకుపోయింది. హృదయం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించే ఈ ఘటన చైనాలో జరిగింది. చైనాలోని ఓ టీవీ ఛానల్లో ప్రజెంటర్గా పనిచేస్తున్న 26 ఏళ్ల క్యూ యువాన్ యువాన్ గర్భం దాల్చింది. అయితే.. ఆ తర్వాత ఆమెకు కేన్సర్ చివరి దశలో ఉన్నట్లు వైద్య పరీక్షలలో తేలింది. ఆ వ్యాధికి తక్షణ చికిత్స కెమోథెరపీ మాత్రమే. కానీ, అత్యంత శక్తిమంతమైన ఆ చికిత్స చేస్తే.. కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాలకు ప్రమాదం.

దాంతో ఎవరూ తీసుకోలేని అత్యంత కఠినమైన నిర్ణయాన్ని ఆ తల్లి తీసుకుంది. ఒకవైపు కేన్సర్ తనను కబళిస్తున్నా, బిడ్డ పుట్టేవరకు కెమోథెరపీ మాత్రం తీసుకునేది లేదని నిక్కచ్చిగా చెప్పేసింది. ఆమెకు పండంటి కొడుకు పుట్టాడు. మూడునెలలు నిండాయి కూడా. సరిగ్గా బాబుకు 100 రోజులు నిండేసరికి.. ఆ తల్లికి నూరేళ్లు నిండిపోయాయి!! చైనాలో పిల్లలు పుట్టిన వందోరోజును చాలా ఘనంగా జరుపుకొంటారు. సరిగ్గా అదే రోజు ఆ తల్లి మరణించడం విధి విలాసమే!! అమ్మదనం అంటేనే నిస్వార్థప్రేమకు ప్రతిరూపం అన్న విషయాన్ని ఆమె తన అపూర్వ త్యాగంతో మరోసారి నిరూపించింది.

మరిన్ని వార్తలు