కోటీ 18లక్షలను దాటిన పాట

20 Jan, 2016 20:09 IST|Sakshi
కోటీ 18లక్షలను దాటిన పాట

బీరుట్: మధురగానంతో శిలలు కూడా కరగుతాయన్నది అతిశయోక్తే కావచ్చు. కానీ  ఈ 11 ఏళ్ల పాప మృదు మధుర గానంతో శిలలకన్నా కఠినమైన మానవ హృదయాలు సైతం కరుగుతాయన్నది అతిశయోక్తి కాకపోవచ్చు. ఈ పాపను చంపేస్తామని హెచ్చరించిన ఐసిస్ టైస్టులు ఒక్కసారి ఈ పాప పాట మనస్ఫూర్తిగా వినివుంటే వారి హృదయాలు కూడా కరిగేవేమో!

ఇరాక్‌లోని క్రిస్టియన్ కుటుంబానికి చెందిన మిర్నా హనా అనే ఈ పాప ఐసిస్ టెర్రరిస్టుల బెదిరింపులకు భయపడి తల్లిదండ్రులతో కలసి ఎనిమిది నెలల క్రితమే లెబనాన్ రాజధాని బీరుట్‌కు వచ్చి తలదాచుకుంటున్నారు. ‘ది వాయిస్ కిడ్స్’ అనే రియాలిటీ టాలెంట్ షోలో పాల్గొనడం ద్వారా ఇప్పుడు ఈ పాప గురించి ప్రపంచానికి తెలిసిపోయింది. షోలో ఆడిషన్‌ కోసం ఈ పాప పాడిన ఇరాక్ ప్రేమగీతం ‘ఎస్టర్‌డే ఇన్ ఏ డ్రీమ్’ను విన్న జడ్జీలు తమను తాము మైమరచిపోయి వింతలోకంలో విహరించారు. ఇంత అద్భుతంగా ఎలా పాడుతున్నావంటూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ‘బాబీలాన్ ప్రిన్సెస్’ అంటూ కితాబ్ కూడా ఇచ్చారు.

 ఆడిషన్‌ కోసం ఆమె పాడిన పాట వీడియోను ‘యూట్యూబ్’లో ఇప్పటికే కోటీ 18 లక్షల సార్లు (11.8 మిలియన్) వీక్షించారంటే ఆమె ఎంత బాగా పాడిందో అర్థం చేసుకోవచ్చు. మరోపాట పాడాల్సిందిగా కోరగా, డిస్నీలాండ్ సినిమా ఫ్రోజెన్ నుంచి ‘లెట్ ఇట్ గో’పాటను పాడిన మిర్నా సభికులను మంత్రముగ్ధుల్ని చేశారు. ప్రేక్షక గ్యాలరీలోని శ్రోతలంతా లేచి నిలబడి 11ఏళ్ల పాపకు నీరాజనాలు పలికారు. ఎలాంటి పరిస్థితుల్లో తాను మాతృదేశం ఇరాక్‌ను వదిలేసి రావాల్సి వచ్చిందో చెబుతుంటే స్టేడియం కన్నీళ్లతో తడిసిపోయింది. ‘మేము లెబనాన్‌కు వచ్చాక, ఐసిస్ టెర్రరిస్టులు నన్ను కిడ్నాప్‌ చేసి చంపాలనుకున్నారని నాన్న నాకు చెప్పినప్పుడు భయంతో వణికిపోయాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు రాత్రిపూట భయంతో వణికిపోతున్నాను. ఒంటరిగా పడుకోలేను’ అని మిర్నా వివరించారు.

 ‘ప్రపంచం కోసం పాడడానికే ఈ గొంతు ఉన్నది. ఇరాక్ అంటే గుర్తొచ్చేది యుద్ధం ఒక్కటే కాదు. ఆ దేశంలో అద్భుతమైన ఇతర అంశాలు కూడా ఉన్నాయి’ అన్న మిర్నా వ్యాఖ్యలకు జడ్జీల కళ్లు చెమర్చాయి. ‘నేడు ఇరాక్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి అందరికి తెల్సిందే. అక్కడ ప్రజలను టెర్రరిస్టులు నరకి చంపుతారు. నా కూతురిని కూడా కిడ్నాప్ చేసి, చంపేస్తామని బెదిరించారు. అందుకే  చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని, ఉన్న ఆస్తిపాస్తులన్నీ వదిలేసి కట్టుబట్టలతో లెబనాన్ చేరుకున్నాము’ అని మిర్నా తండ్రి చెప్పడమూ కూడా స్టేడియంలో అందరిని కదిలించింది. మిర్నాకు సినిమాల్లో పాటలు పాడాల్సిందిగా అప్పుడే ఆఫర్లు కూడా వస్తున్నాయి.

మరిన్ని వార్తలు