ఖషోగ్గీ హత్య; సౌదీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!?

25 Oct, 2018 12:57 IST|Sakshi

వాషింగ్టన్‌ : వాషింగ్టన్‌ పోస్టు కాలమిస్టు జమాల్‌ ఖషోగ్గీ హత్య కేసులో సౌదీ అరేబియాకు ఉచ్చు బిగుస్తున్నట్లుగానే కన్పిస్తోంది. ఖషోగ్గీని హత్య చేయించింది సౌదీ అరేబియానే అనేందుకు తమ దగ్గర ఆధారాలున్నాయంటూ టర్కీ ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖషోగ్గీ హత్య కేసు విచారణలో భాగంగా సేకరించిన ఆడియో క్లిప్పులను అమెరికా గూఢాచార సంస్థ డైరెక్టర్‌(సీఐఏ) గినా హాస్పెల్‌కు అందించినట్లుగా సమాచారం. ట్రంప్‌ క్యాబినెట్‌లో అత్యంత కీలక వ్యక్తిగా ఉన్న గినా ప్రస్తుతం టర్కీలో రహస్యంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆడియో క్లిప్పులను విన్నట్లుగా తెలుస్తోంది. దీంతో సౌదీకి చెక్‌ పెట్టి పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అమెరికా ఖషోగ్గీ ఉదంతాన్ని వాడుకునే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి.

మధ్య ప్రాచ్య రాజకీయాల్లో సౌదీ కీలక శక్తిగా ఎదిగేందుకు తోడ్పడిన ట్రంప్‌... ఖషోగ్గీ మృతిపై మొదట సౌదీ అరేబియాపై తమకు అనుమానాలు లేవన్నారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో సౌదీ అధికారులు అత్యంత క్లిష్ట సమస్యలను ఎదుర్కోబోతున్నారంటూ మంగళవారం వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఖషోగ్గీ హత్య కుట్రలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మంది సౌదీల వీసాలను కూడా అమెరికా రద్దు చేసింది. ఈ విషయం గురించి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో మాట్లాడుతూ.. ‘ఇవి చాలా చిన్న విషయాలు. నేరస్తులు ఎవరైనా సరే జవాబుదారీగా ఉండాల్సిందే. అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు మేము వెనుకాడబోం’ అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఖషోగ్గీ హత్యోదంతం గురించి సీఐఏ మాజీ అధికారి మాట్లాడుతూ.. ’ ప్రస్తుతం బాల్‌ వాషింగ్టన్‌ కోర్టులో ఉంది. ప్రజలతో పాటు కాంగ్రెస్‌ కూడా గినా మాటల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

అసలేం జరిగిందంటే..
సౌదీ జాతీయుడైన ఖషోగ్గీ సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. ఈ నెల 2న తన వ్యక్తిగత పనిపై ఖషోగ్గీ టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలోకి వెళ్లి అదృశ్యమయ్యారు. ఖషోగ్గీని ఎంబసీలోనే చంపేశారని టర్కీ ఆరోపించింది. అయితే ఖషోగ్గీ మృతితో తమకు సంబంధం లేదని మొదట ప్రకటించిన సౌదీ.. ఆ తరువాత మాటమార్చి ఎంబసీలోనే ఓ గొడవలో ఆయన మరణించాడంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సౌదీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఖషోగ్గీ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ప్రకటించారు. అయితే ప్రధాన కుట్రదారుడు సల్మానే అయినపుడు విచారణ పారదర్శకంగా కొనసాగుతుందని నమ్మడం చాలా హాస్యాస్పదమైన విషయమని టర్కీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు