యువరాజే చంపమన్నారు!

17 Nov, 2018 16:32 IST|Sakshi
మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌, జమాల్‌ ఖషోగ్గీ

ఖషోగ్గీ హత్య వెనుక సౌదీ యువరాజు ప్రమేయం

సీఐఏ నిర్ధారించిందన్న అమెరికా మీడియా

వాషింగ్టన్‌: ప్రముఖ జర్నలిస్ట్‌, వాషింగ్టన్‌ పోస్టు కాలమిస్టు జమాల్‌ ఖషోగ్గీ హత్య వెనుక సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ హస్తం ఉందని అమెరికా గూఢచార సంస్థ(సీఐఏ) నిర్ధారణకు వచ్చినట్టు యూఎస్‌ మీడియా వెల్లడించింది. ఆయన ఆదేశాల మేరకే  ఖషోగ్గీని పథకం ప్రకారం అంతమొందించినట్టు తెలిపింది. సౌదీకి చెందిన 15 మంది ఏజెంట్లు ప్రభుత్వ విమానంలో ఇస్తాంబుల్‌ వెళ్లి, సౌదీ రాయబారా కార్యాలయంలో ఖషోగ్గీని హత్య చేశారని వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది. దీనిపై స్పందించేందుకు సీఐఏ నిరాకరించింది.

యువరాజు మహ్మద్‌ బిన్‌ సోదరుడు, అమెరికాలోని సౌదీ రాయబారి ఖలీద్‌ బిన్‌ సల్మాన్‌ ద్వారా ఖషోగ్గీని ఇస్తాంబుల్‌కు రప్పించినట్టు సీఐఏ వర్గాలు గుర్తించినట్టు సమాచారం. ఇస్తాంబుల్‌లోని తమ కాన్సులేట్‌కు వెళ్లి ఖషోగ్గీకి అవసరమైన పత్రాలు తీసుకోవాలని, ఎటువంటి ముప్పు ఉండబోదని ఆయనతో ఫోన్‌లో ఖలీద్‌ బిన్‌ చెప్పినట్టు సమాచారం. దీన్ని సౌదీ కాన్సులేట్‌ తోసిపుచ్చింది. ఇదంతా అవాస్తవమని తెలిపింది. టర్కీకి వెళ్లే విషయం గురించి ఖషోగ్గీతో ఖలీద్‌ బిన్‌ మాట్లాడలేదని సౌదీ ఎంబసీ అధికార ప్రతినిధి ప్రకటించారు.

ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో అక్టోబర్‌ 2న ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. టర్కీ మహిళను పెళ్లాడేందుకు అవసరమైన పత్రాల కోసం వెళ్లి ఆయనను సౌదీ ఏజెంట్లు హత్య చేశారు. ఖషోగ్గీ అదృశ్యం గురించి తమకేమీ తెలియదని బుకాయించిన సౌదీ తర్వాత నేరాన్ని ఒప్పుకుంది. ఖషోగ్గీ హత్య వెనుక సౌదీ యువరాజు ప్రత్యక్ష ప్రమేయానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలను సీఐఏ సంపాదించలేదని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడించింది. ఖషోగ్గీ హత్య చేసిన బృందంలో సభ్యులు ఫోన్‌లో యువరాజు సన్నిహితులతో మాట్లాడిన దాన్ని బట్టి ఆయన ప్రమేయం ఉందన్న అంచనాకు వచ్చిందని వివరించింది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో ఖషోగ్గీ హంతకులకు మరణశిక్ష అమలు చేస్తామని సౌదీ అరేబియా చెబుతోంది.

ఖషోగ్గీ నన్ను పెళ్లాడారు
జమాల్‌ ఖషోగ్గీ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు తనను పెళ్లాడారంటూ ఈజిప్టు మహిళ ఒకరు తెరపైకి వచ్చారు. వాషింగ్టన్‌లో జూన్‌ నెలలో తాము పెళ్లి చేసుకున్నామని ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’తో చెప్పారు. అయితే తన వివరాలు వెల్లడించేందుకు ఆమె నిరాకరించారు. ‘ముస్లిం భార్యగా గుర్తింపు కోరుకునే పూర్తి హక్కు తనకుంద’ని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఖషోగ్గీ కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈజిప్టు మహిళను ఖషోగ్గీ పెళ్లి చేసుకున్న విషయం తనకు తెలియదని ఆయనను పెళ్లాడాలనుకున్న టర్కీ మహిళ హార్టిస్‌ సెంగిజ్‌ చెప్పారు. ఆమె వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు