స్వేచ్ఛ కోసం.. అమెరికా అంతర్యుద్ధం!

12 Feb, 2016 10:45 IST|Sakshi
ప్రపంచదేశాల్లో అగ్రరాజ్యం ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం అమెరికా. అలాంటి దేశ చరిత్రలో కీలక పరిణామం 1861- 65 అంతర్యుద్ధం. అబ్రహాం లింకన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన ఈ యుద్ధంతోనే అమెరికాలో బానిసత్వం పూర్తిగా అంతరించిపోయింది. ప్రతి మనిషికీ స్వేచ్ఛ ఉండాలనేదే ఈ యుద్ధ లక్ష్యం. ఈ పోరాటం జరగకపోతే అమెరికాలో బానిసత్వం ఇప్పటికీ అంతమయ్యేది కాదేమో..! అంతటి చారిత్రక నేపథ్యం, ప్రయోజనం ఉన్న యుద్ధం, 
 
 దాని కథాకమామిషు ఏంటో చూద్దాం..!
అమెరికాలో బానిసత్వం 1619లో మొదలైంది. అప్పుడు అమెరికా బ్రిటన్ పరిపాలనలో ఉండేది. ఆఫ్రికా నుంచి తీసుకువచ్చిన బానిసల్ని పొగాకు పండించడానికి ఉపయోగించేవారు. 1860 నాటికి వీరి సంఖ్య 40 లక్షలకు చేరింది. అమెరికా దక్షిణ భాగంలోని జనాభాలో మూడో వంతు బానిసలే ఉండేవారు.
 
 దయనీయ పరిస్థితులు...
బానిసలందర్నీ ఇరుకు గదుల్లో బంధించేవారు. వారికి సరైన ఆహారం, వసతులు కల్పించేవారు కాదు. ఒక్కో యజమాని దగ్గరా 50 మంది బానిసలు ఉండేవారు. బానిసలు చదువుకోవడంపై నిషేధం ఉండేది. బానిస స్త్రీలపై యజమానులు లైంగిక దాడులు చేసేవారు. ఎదురు తిరిగిన వారికి కఠినమైన శిక్షలుండేవి. బానిస వివాహాలకు చట్టబద్ధత లేదు. ఎక్కువ మంది పిల్లల్ని కనేలా వారిపై ఒత్తిడి తెచ్చేవారు. ఎంత ఎక్కువ మందిని కంటే యజమానికి అంత ఎక్కువ లాభం.
 
 ఇదీ నేపథ్యం...
బానిసత్వాన్ని రద్దు చేయాలని 1830 నుంచే ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. 1850 మెక్సికో ఒప్పందంలో బానిసల అంశాన్ని విస్మరించాక ఈ ఉద్యమం మరింత వేడెక్కింది. 1857లో అమెరికా సుప్రీం కోర్టు ఆఫ్రో-అమెరికన్లు అమెరికా దేశ పౌరులు కారని వివాదాస్పద తీర్పునిచ్చింది. 1859లో జాన్ బ్రౌన్ అనే ఉద్యమకారుడు వర్జీనియాలోని హార్పర్ రేవుపై దాడి చేయడంతో అతనికి మరణ శిక్ష విధించారు. ఉద్యమకారులు అతడ్ని జాతి కోసం మరణించిన వీరుడిగా గుర్తిస్తే, దక్షిణ ప్రాంతంవారు అతడిపై కిరాయి హంతకుడిగా ముద్ర వేశారు.
 
 రక్త చరిత్ర...
1861 అధ్యక్ష ఎన్నికలు పూర్తి కాగానే బానిసలు అధికంగా ఉన్న ఏడు దక్షిణ రాష్ట్రాలు సమాఖ్యగా ఏర్పడి తమని తాము ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నాయి. అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న జేమ్స్ బుకానన్ దీన్ని చట్ట వ్యతిరేక చర్యగా ప్రకటించినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అదే ఏడాది మార్చి 4న అబ్రహాంలింకన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. వెనువెంటనే ఈ చర్యని తిరుగుబాటుగా పరిగణించాడు. 75 వేల మంది సైనికులను 90 రోజుల పాటు తాత్కాలికంగా నియమించాలని ఆదేశాలు జారీ చేశాడు. మూడు నెలల్లో అంతర్యుద్ధాన్ని అణచివేయగలనని ఆయన భావించారు. ఇంతలో మరో నాలుగు రాష్ట్రాలు సమాఖ్యలో చేరాయి. పశ్చిమ తీరంలో జరిగిన యుద్ధంలో గెలుపొందటం అమెరికాకు పెద్ద ఊరట. కానీ తూర్పు వైపు వర్జీనియాలో జరిగిన యుద్ధంలో మాత్రం ఓడిపోయింది. సైన్యాన్ని మోహరించినప్పటికీ యుద్ధవ్యూహాల అమలులో వైఫల్యంపై లింకన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. తూర్పు వైపు దాడుల్లో 23 వేల మంది సైనికులను అమెరికా కోల్పోయింది. 1862 జులై ఒకటిన 17 లక్షల మంది సైనికులు, తిరుగుబాటుదారుల మధ్య నాలుగు రోజుల తీవ్ర యుద్ధం అనంతరం వర్జీనియా అమెరికా సొంతమైంది. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన అంతర్యుద్ధం 1865లో ముగిసింది. ఈ యుద్ధంలో ఇరుపక్షాల నుంచి దాదాపు 6,20,000 మంది మరణించారు. నాలుగు లక్షల మంది పైగా గాయపడ్డారు. యుద్ధ సమయంలో ద్రవ్యోల్బణం ప్రభావంతో ధరలు విపరీతంగా పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడంతో సామాన్యుల ఆకలి కేకలు మిన్నంటాయి.
 
 కొత్త చరిత్ర...
అమెరికా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ తీర్మానం 1865, జనవరి 31న వెలువడింది. అమెరికా పరిధిలో బానిసత్వాన్ని రద్దు చేస్తూ 13వ రాజ్యాంగ సవరణను లింకన్ అధ్యక్షతలోని ప్రభుత్వం ఆమోదించింది. అంతకు ముందు 1864లో జరిగిన ఎన్నికల్లో లింకన్ ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో రెండోసారి గెలుపొందాడు. 1868లో జరిగిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికాలో పుట్టిన వారందరికీ సమాన హక్కులుంటాయని ప్రభుత్వం తీర్మానించింది. అలా శ్వేతజాతీయేతరులపై ఏర్పడిన ఆంక్షలు క్రమంగా తొలగిపోయాయి. బరాక్ ఒబామా 2009లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై ఆ పదవి చేపట్టిన తొలి శ్వేతజాతీయేతరుడిగా చరిత్ర సృష్టించారు. 
మరిన్ని వార్తలు