బహ్రెయిన్‌లో క్షమాభిక్ష అమలు

29 Jun, 2015 17:03 IST|Sakshi
బహ్రెయిన్‌లో క్షమాభిక్ష అమలు

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారికి ఊరట
సాక్షి, మోర్తాడ్ (నిజామాబాద్): బహ్రెయిన్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష అమలు చేస్తోంది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు క్షమాభిక్షకు గడువు విధించింది. బహ్రెయిన్‌కు విజిట్ లేదా కంపెనీ వీసాలపై వెళ్లి గడువు ముగిసినా అక్కడే ఉన్న కార్మికులకు అక్కడి ప్రభుత్వం ఇచ్చిన క్షమా భిక్షతో ఊరట లభించనుంది. కంపెనీ వీసాలపై వెళ్లి పని నచ్చకపోవడంతో ఎంతో మంది కార్మికులు ఇతర కంపెనీల్లో చట్ట విరుద్ధంగా పని చేస్తున్నారు.
 
 బహ్రెయిన్‌లో అలాంటి తెలంగాణ కార్మికులు ఆరు వేల మందికి పైగా ఉంటారని అంచనా. ప్రభుత్వం అమలు చేయనున్న క్షమాభిక్షతో కార్మికులకు తమ చేతిలో పాస్‌పోర్టు లేకపోతే లేబర్ మానిటరింగ్ రిక్రూట్‌మెంట్ అథారిటీ(ఎల్‌ఎంఆర్‌ఏ)కి దరఖాస్తు చేసుకోవాలి. వారు కొత్త పాస్‌పోర్టును మన దేశ విదేశాంగ శాఖ ద్వారా జారీ చేయించి కంపెనీ ల్లో పని కల్పిస్తారు. ఒక వేళ పని చేయడం ఇష్టం లేకపోతే, జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకుండా జైలుకు పోకుండా ఇంటికి చేరుకోవచ్చు. చేతిలో పాస్‌పోర్టు ఉం డి వీసా గడువు ముగిసినవారికి ఎల్‌ఎంఆర్‌ఏ కొత్త వీసాలను జారీ చేయిస్తుంది. ఆరు నెలల కాలంలో వారు పట్టుబడినా జైలు శిక్ష ఉండదు. బహ్రెయిన్ ప్రభుత్వానికి జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒక వేళ ఆరు నెలల కాలం దాటితే మాత్రం అక్కడి ప్రభుత్వం కఠిన శిక్షలను అమలు చేయనుంది. క్షమాభిక్షతో చట్ట విరుద్ధంగా ఉంటున్న కార్మికులు క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం దొరికిందని అక్క డి స్టార్ హోటల్‌లో పని చేస్తున్న తిమ్మాపూర్‌కు చెందిన రామ్మోహన్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు