వాతావరణమే.. విలన్‌

15 Nov, 2019 03:20 IST|Sakshi

చిన్నారుల ఆరోగ్యాన్ని కబళిస్తున్న వాతావరణ మార్పులు 

భారత్‌లో ఒక తరం నష్టపోయే ప్రమాదం

లాన్సెట్‌ నివేదిక

పారిస్‌: వాతావరణంలో వస్తున్న పెనుమార్పులు ప్రపంచవ్యాప్తంగా పసిమొగ్గల జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయని లాన్సెట్‌ నివేదిక హెచ్చరించింది. శిలాజ ఇంధన ఉద్గారాలను కట్టడి చేయకపోతే భారత్‌ ఒకతరం ఆరోగ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని తేల్చింది. భారత్‌లో దీని ప్రభావం అత్యధికంగా కనబడుతోందని వెల్లడించింది. గత 50 ఏళ్లుగా చిన్నారుల ఆరోగ్యానికి భారత్‌ ఎంతో కృషి చేసిందని, కానీ వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటివరకు చేసినదంతా వృథా కానుందని అంచనా వేసింది. ఇవాళ పుట్టిన ప్రతీ బిడ్డ భవిష్యత్‌ను వాతావరణంలో మార్పులే నిర్దేశిస్తాయని నివేదిక సహ రచయిత్రి పూర్ణిమ చెప్పారు. లాన్సెట్‌ కౌంట్‌డౌన్‌ ఆన్‌ హెల్త్, క్లైమేట్‌ ఛేంజ్‌ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు సహా మరో 35 సంస్థలకు చెందిన 120 మంది పర్యావరణ నిపుణులు అధ్యయనం చేశారు. వాతావరణంలో మార్పులు, ప్రభావానికి సంబంధించి 41 అంశాలను  అధ్యయనం చేసి నివేదిక  రూపొందించారు.  

ఆరోగ్యంపై ప్రభావం చూపించే అంశాలు
► కరువు పరిస్థితులు
► అంటు వ్యాధులు
► వరదలు
► వడగాడ్పులు
► కార్చిచ్చులు  

ఏయే వ్యాధులు వచ్చే అవకాశం
► నీటి కాలుష్యంతో డయేరియా
► వాయు కాలుష్యంతో ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులు
► చిన్నారుల్లో ఎదుగుదల లోపాలు
► డెంగీ వ్యాధి విజృంభణ
► గుండెపోటు  

ఏయే దేశాలపై ప్రభావం  
► అత్యధిక జనాభా కలిగిన దేశాలు, వైద్య ఖర్చులు పెనుభారంగా మారిన దేశాలు, అసమానతలు, పేదరికం, పౌష్టికాహార లోపాలు కలిగిన భారత్‌ వంటి దేశాలపై    వాతావరణంలో వస్తున్న మార్పులు
    పసివాళ్ల ఉసురు తీస్తున్నాయి.  
► భారత్‌లో 2.1 కోట్ల మందిపై వాతావరణ మార్పుల ప్రభావం  
► చైనాలో 1.7 కోట్ల మందికి ఆరోగ్య సమస్యలు  
► 196 దేశాలకు గాను 152 దేశాలపై వాతావరణంలో మార్పులు అత్యధిక ప్రభావాన్ని చూపిస్తాయి.
► 2015లో భారత్‌లో వీచిన వడగాడ్పులతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఇకపై సర్వసాధారణం కానున్నాయి.  

పరిష్కార మార్గాలేంటి ?  
► ప్రతీ ఏడాది ప్రపంచ దేశాలు సగటున 7.4 శాతం కర్బన ఉద్గారాలను తగ్గిస్తే 2050 నాటికి 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతకు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోగలరు
► భారత్‌ థర్మల్‌ విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించి సంప్రదాయేతర     ఇంధనంపైనే ఆధారపడాలి.  
► ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి
► చెత్త, పంట వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా ఎదుర్కోవాలి.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా