ఎవరెస్ట్‌.. ఎ ‘వరెస్ట్‌’...

18 Jun, 2018 17:33 IST|Sakshi

ఏటికేడూ హిమాలయాల్లోని మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అదే స్థాయిలో వారు వదిలేస్తున్న వ్యర్థాల పరిమాణమూ పెరిగింది. వెరసి 8,848 మీటర్ల ఎవరెస్ట్ శిఖరం.. నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చెత్త కుప్పగా మారిపోయింది. చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఎవరెస్ట్‌పై పరిస్థితిని వివరిస్తూ విడుదల చేసిన ఓ నివేదిక విస్మయానికి గురిచేస్తోంది. 

నిజానికి ఎవరెస్ట్‌పై చెత్త పేరుపోతుండటం ఇప్పటిదేం కాదు. ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తోంది. ఒకానోక దశలో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ పై పోగయ్యే వర్థాలను తగ్గించేందుకు ఐదేళ్ల కిందట నేపాల్ ప్రభుత్వం సరికొత్త నిబంధన విధించింది. పర్వతారోహకుల బృందం పైకి ఎక్కేప్పుడు కొంత సొమ్మును డిపాజిట్ చేయాలి. ఒక్కో సభ్యుడు తిరిగి వచ్చేటప్పుడు ఎనిమిది కిలోల చొప్పున వ్యర్థాలను తెవాలి. అప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. టిబెట్ వైపు నుంచి ఎక్కేవారు కచ్చితంగా ఎనిమిది కిలోల వ్యర్థాలను తేవాలి. గత ఏడాది నేపాల్ నుంచి వెళ్లిన పర్వతారోహకులు 25 టన్నుల చెత్తను - 15 టన్నుల మానవ విసర్జితాలను తెచ్చారని సాగర్ మాత పొల్యూషన్ కంట్రోల్ కమిటీ తెలిపింది. కానీ ఏటా ఎవరెస్ట్ పై పేరుకుపోతున్న వ్యర్థాలతో పోలిస్తే ఇది చాలా తక్కువన్నది తేలింది.

అవినీతి దందా... ‘ఒక్కో బృందం ఎవరెస్ట్ పర్యటనకు రూ.14 లక్షల నుంచి రూ.68 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. అంత మొత్తం చెల్లించినప్పుడు తిరిగి చెత్తను వెంటపెట్టుకుని రావటం ఏంటన్న భావనతో చాలా మంది అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి తమ డిపాజిట్‌ సొమ్మును వెనక్కి తీసుకుంటున్నారు. ఇలా రెండు దశాబ్దాలుగా ఎవరెస్ట్ అధిరోహకుల సంఖ్య పెరిగి వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు పడేస్తుండటంతో టన్నుల మేర చెత్త పేరుకుపోయింది’ అని నేపాల్‌ పర్వతారోహకుల సంఘం మాజీ అధ్యక్షుడు నేపాలీ షెర్పా పెంబా డోర్జే ఆవేదన వ్యక్తం చేశారు.

గత నెలలో 30 మంది సభ్యుల బృందం 8.5 టన్నుల చెత్తను అతికష్టం మీద తీసుకొచ్చినట్లు ఆయన చెబుతున్నారు. అవగాహన సదస్సులు ఎన్ని నిర్వహిస్తున్నా.. అవినీతి దందాతో లాభం లేకుండా పోతోందని పెంబా డోర్జే ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలపై పర్యావరణ వేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ‘ఎవరెస్ట్ పై పెద్ద ఎత్తున పెరిగిపోతున్న చెత్త సుందర హిహాలయాలను కలుషితం చేస్తోంది. ఎవరెస్ట్ పై పేరుకున్న వ్యర్థాలు మంచులో కలుస్తున్నాయి. మంచు కరిగినప్పుడు కలుషిత నీరు ఉత్పత్తి అవుతోంది. అది మహా ప్రమాదం’ అని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు