నగ్న శరీరాలపై కోళ్ల పందెం

4 Oct, 2019 14:09 IST|Sakshi

వెనిజులా : ఖైదీలను హింసించటానికి వెనిజులాలోని ఓ జైలు అధికారులు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. సరిపడా తిండి, నీరు ఇవ్వాలంటూ నిరసన చేపట్టిన ఖైదీలను నగ్నంగా నేలపై పడుకోబెట్టి వారి శరీరాలపై కోళ్ల పందెం పెట్టారు. ఈ సంఘటన వెనిజులా, అనాకోలోని పోలీస్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గత శుక్రవారం అనాకోలోని పోలీస్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌లోని ఖైదీలు తమకు సరిపడా ఆహారం, నీరు ఇవ్వటం లేదంటూ, బంధువులు చూడటానికి వచ్చినపుడు మెడిసిన్స్‌ తేవటానికి అనుమతి ఇవ్వాలంటూ నిరసన చేపట్టారు. దీంతో ఆగ్రహించిన జైలు అధికారులు తమ రాక్షసత్వాన్ని బయటపెట్టారు.

దాదాపు 70మంది ఖైదీలను 2 గంటల పాటు విచక్షణా రహితంగా కొట్టడమే కాకుండా వారిని నగ్నంగా చేసి, నేలపై పడుకోబెట్టి శరీరాలపై కోళ్ల పందెం పెట్టారు. అవి వారి శరీరాలను చీరుతుంటే చూసి ఆనందించారు. ఆ తర్వాత కొన్ని గంటలు వారికి తిండి, నీరు కూడా ఇవ్వలేదు. వెనిజులాకు చెందిన ఓ రిపోర్టర్‌ ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. దీంతో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం తీవ్ర స్థాయిలో మండిపడింది. దీంతో స్పందించిన  ప్రభుత్వం సంఘటనపై విచారణకు ఆదేశించింది.

మరిన్ని వార్తలు