కోలి కార్నివాల్‌లో లైంగిక దాడులు

6 Feb, 2016 20:49 IST|Sakshi
కోలి కార్నివాల్‌లో లైంగిక దాడులు

కోలి: జర్మనీలోని కోలి నగరంలో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా వందలాది మంది మహిళలపై లైంగిక దాడులు జరిగిన భయానక సంఘటలను మరచిపోకముందే మళ్లీ అదే నగరంలో గురువారం ‘విమెన్స్ కార్నివాల్’ సందర్భంగా మహిళలపై లైంగిక దాడులు చోటు చేసుకున్నాయి. నూతన సంవత్సరం వేడుకల్లో వలసవచ్చిన ఉత్తర ఆఫ్రికా, అరబిక్ జాతికి చెందిన యువుకులు లైంగిక దాడులకు పాల్పడగా, ఈసారి యూరోపియన్లే లైంగిక దాడులకు దిగడం గమనార్హం.

 విమెన్స్ కార్నివాల్‌లో దాదాపు 250 నేరపూరిత సంఘటనలు జరగ్గా, 220 ఫిర్యాదులు పోలీసులకు అందాయి. వాటిలో 22 లైంగికపరమైన సంఘటనలు ఉన్నాయి. తప్పతాగిన కొంత మంది యువకులు మహిళల దుస్తుల్లోకి చేతులు దూర్చి అసభ్యంగా ప్రవర్తించగా, మరికొంత మంది యువకులు రేప్‌లకు పాల్పడ్డట్టు ఫిర్యాదులు అందాయని పోలీసు అధికారులు తెలిపారు. సీఎన్‌ఎన్‌కు అనుబంధంగా పనిచేస్తున్న ఆర్టీటీబీఎఫ్ రేడియో టెలివిజన్ జర్నలిస్టు పట్ల కూడా యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. వారిస్తున్నా వినకుండా ఆమెను ముద్దు పెట్టుకునేందుకు తెగబడ్డారు.

 కార్నివాల్ వేడుకలకు ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుండగానే ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టారు. వాటిని ప్రసారం చేయకూడదని భావించిన ఛానెల్ నిర్వాహకులు రెండు ఫొటోలను మాత్రం విడుదల చేశారు. నూతర వేడుకల్లో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈసారి భారీ ఎత్తున భద్రతా దళాలకు మోహరించిన లైంగిక దాడులు జరగడం శోచనీయమని పోలీసు అధికారులు అన్నారు. ఇప్పటి వరకు కేసులకు సంబంధించి 190 మందిని అదుపులోకి తీసుకున్నామని వారు తెలిపారు. కార్నివాల్ సందర్భంగా ఇలాంటి లైంగిక దాడులు ప్రతి ఏటా జరుగుతున్నాయని, అయితే ఈసారి ఈ సంఖ్య ఎక్కువగా ఉందని వారు వివరించారు.
 

మరిన్ని వార్తలు