డేటా అమ్ముతాం రండి!

1 Jun, 2017 02:06 IST|Sakshi
డేటా అమ్ముతాం రండి!

► వాన్నాక్రై సృష్టికర్తల ప్రతిపాదన

నెలకింత చెల్లించండని బ్లాగ్‌ పోస్ట్‌

జూలైలో డేటా విడుదల!

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌: వాన్నాక్రై గుర్తుందా? వందల దేశాల్లోని కంప్యూటర్లను, వాటిలోని సమాచారాన్ని సీజ్‌ చేసి మరీ డబ్బులు డిమాండ్‌ చేసిన ఈ ర్యాన్‌సమ్‌వేర్‌ సృష్టికర్తలు షాడో బ్రోకర్స్‌ మరో సంచలనానికి తెరలేపారు. అగ్రరాజ్యం అమెరికా తాలూకూ నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఏ) మొదలుకుని అనేక మందికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని.. నెలకింత అని సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు కడితే దాన్ని అందరికీ ఇచ్చేస్తామని ప్రకటించారు. షాడో బ్రోకర్స్‌ తాజా ప్రతిపాదనకు ఎంత మంది స్పందిస్తారో? ఎలాంటి సమాచారం బయటకొస్తుందో ప్రస్తుతానికి సస్పెన్స్‌. కాకపోతే వాన్నాక్రై కంటే ముందు ఈ హ్యాకర్ల బృందం నడిపిన వ్యవహారం మాత్రం ఆసక్తికరమైందే. అదేమిటో మీరే చూడండి.

వాన్నాక్రై ర్యాన్‌సమ్‌వేర్‌ ప్రపంచ దేశాలను వణికించేందుకు చాలా నెలల ముందే.. కచ్చితంగా చెప్పాలంటే గత ఆగస్టులోనే షాడో బ్రోకర్స్‌ ఓ ప్రకటన చేసింది. ప్రపంచం మీద కన్నేసేందుకు ఎన్‌ఎస్‌ఏ సిద్ధం చేసిన కొన్ని టూల్స్‌ తమ వద్ద ఉన్నాయని.. ఆన్‌లైన్‌ వేలం ద్వారా వీటిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చని అప్పట్లో ప్రకటించింది. కానీ వేలానికి పది లక్షల బిట్‌కాయిన్స్‌ చెల్లించాల్సి ఉండటంతో పెద్దగా స్పందన రాలేదు. దీంతో షాడో బ్రోకర్స్‌ తర్వాతి నెలల్లో నాలుగు సెట్ల హ్యాకింగ్‌ టూల్స్‌ విడుదల చేసింది.

వాన్నాక్రై వెనుక ఉన్న ఎటర్నల్‌ బ్లూ వీటిల్లో ఒకటి. మిగిలిన మూడింటి పరిస్థితి ఏమిటి? వాటినెవరైనా వాడుతున్నారా? ఇదే నిజమైతే వాటి ప్రభావమేమిటి? అన్నది రానున్న కాలంలో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంచితే.. తాజాగా గత నెలలోనే షాడో బ్రోకర్స్‌ ఒక బ్లాక్‌ ద్వారా నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ తాలూకూ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం.. భారీ ఎత్తున సమాచారం(బ్యాంక్‌ అకౌంట్ల వివరాలు మొదలుకుని.. వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు ఏమైనా కావచ్చు) కావాలనుకునే వారు అందుకోసం 20 వేల డాలర్ల విలువ చేసే జెడ్‌ క్యాష్‌ డిజిటల్‌ క్రిప్టో కరెన్సీ చెల్లించాల్సి ఉంటుంది.

వంద జెడ్‌క్యాష్‌ కాయిన్లకు సమానమైన ఈ మొత్తాన్ని చెల్లించిన తర్వాత వచ్చే జూలైలో రెండు దఫాలుగా సబ్‌స్క్రైబర్లు అందరికీ ఈ సమాచారం అందుతుంది. ఆ సమాచారంతో వాళ్లేం చేసుకుంటారో తమకు సంబంధం లేదని షాడో బ్రోకర్స్‌ అంటున్నా.. కొనుక్కునే వారు కచ్చితంగా బ్లాక్‌మెయిలింగ్, లేదా చోరీ వంటి అక్రమ మార్గాలకు పాల్పడతారన్నది గ్యారెంటీ! బిట్‌ కాయిన్లకు బదులుగా జెడ్‌క్యాష్‌ కాయిన్లను వాడటంపై కూడా షాడో బ్రోకర్స్‌ ఓ వివరణ ఇచ్చింది. అమెరికా రక్షణ శాఖకు చెందిన డార్పా, ఇజ్రాయెల్‌ కలసి సృష్టించిన ఈ జెడ్‌ క్యాష్‌ కాయిన్లు బిట్‌కాయిన్ల కంటే సురక్షితమైనవని అంటోంది. మిగలిన సంగతులు ఎలా ఉన్నప్పటికీ ఎటర్నల్‌ బ్లూ లాంటి మరిన్ని టూల్స్‌ కూడా ఈ సమాచారంలో ఉంవచ్చన్న అంశం మాత్రం సైబర ప్రపంచాన్ని కలవర పరిచేదే!

మరిన్ని వార్తలు