సూర్యుడిపైకి కామెట్స్‌ను పంపిన ఏలియన్‌ స్టార్‌

27 Mar, 2018 16:58 IST|Sakshi
అంతరిక్షంలో అద్భుతాన్ని మనిషి వీక్షిస్తున్న ఊహాజనిత చిత్రం

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : దాదాపు 70 వేల ఏళ్ల క్రితం ఆకాశంలో జరిగిన అద్భుతంపై పరిశోధకులు ఆశ్చర్యపోయే నిజాలను వెల్లడించారు. స్కోల్జ్‌ స్టార్‌ లేదా బైనరీ స్టార్‌ అనే అతి చిన్న ఏలియన్‌ నక్షత్రం సౌర కుటుంబం మధ్యలోకి తోక చుక్కలను, గ్రహ శకలాలను పంపించిందని చెప్పారు.

ఇదే సమయంలో ఆఫ్రికా పరిసర ప్రాంతాల్లో నివసించడం ప్రారంభించిన మన పూర్వీకులకు ఆ నక్షత్రం కనిపించినట్లు వెల్లడించారు. సదరు నక్షత్రం సూర్యుడికి ఒక కాంతి సంవత్సరం కన్నా తక్కువ దూరంలోకి రావడం వల్లే మనుషులు ఆ దృశ్యాన్ని చూడగలిగారని చెప్పారు.

ఆకాశంలో ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఏలియన్‌ స్టార్‌ మానవుడి కంటికి కనిపించిందని వివరించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ సౌర వ్యవస్థలో ఉన్నాయని కంప్లూటెన్స్‌ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జి అంతరిక్ష పరిశోధకులు పేర్కొన్నారు.

సౌర కుటుంబంలో హైపర్‌బోలిక్‌ ఆర్బిట్స్‌లో తిరుగుతున్న 340 శకలాలను పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నామని వివరించారు. సాధారణంగా మనం ఊహించుకునే ఎలిప్టికల్‌ ఆర్బిట్స్‌కు బదులు సూర్యుడికి చేరువలో ‘వీ’ ఆకారపు కక్ష్యలు కనిపించినట్లు తెలిపారు. ఈ వీ ఆకారపు కక్ష్యల్లో ఓర్ట్‌ తోకచుక్కలు తిరుగుతున్నట్లు గుర్తించామని వివరించారు.

విశ్వం పుట్టుక నాటి నుంచి ఓర్ట్‌ తోక చుక్కలు ఉన్నాయని చెప్పారు. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి ఎక్కడ అంతమవుతుందన్న విషయాన్ని ఈ తోకచుక్కల ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. స్కోల్జ్‌ అనే ఏలియన్‌ నక్షత్ర ప్రభావం వల్ల ఓర్ట్‌ తోకచుక్కలు గతి తప్పి సూర్యుడికి అతి చేరువగా వెళ్లాయని చెప్పారు. స్కోల్జ్‌ నక్షత్రాన్ని కనుగొన్నట్లు 2015లో శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ఏంటీ ఓర్ట్‌ మేఘం ?
ఓర్ట్‌ మేఘం అనేది సౌర వ్యవస్థ చుట్టూ ఉండే ఓ ఊహాజనిత ప్రదేశం. విశ్వం పుట్టుక నుంచి ఓర్ట్‌ క్లోడ్‌లో ట్రిలియన్ల కొద్దీ తోక చుక్కలు ఉన్నాయి. వీటిలో కొన్ని అప్పుడప్పుడూ గతి తప్పి సౌర వ్యవస్థలోని గ్రహాల వైపు వస్తాయి.

మరిన్ని వార్తలు