ప్రధాని పీఠం.. కమ్యూనిస్టుల కైవసం

11 Oct, 2015 17:02 IST|Sakshi
ప్రధాని పీఠం.. కమ్యూనిస్టుల కైవసం

కఠ్మాండు: ఇటీవలే నూతన రాజ్యాంగాన్ని స్వీకరించిన నేపాల్ కు కొత్త ప్రధానిగా కమ్యూనిస్ట్ పార్టీ నేత కె.పి.శర్మ వోలి (ఖడ్గ ప్రసాద్ శర్మ) ఎన్నికయ్యారు. ఆదివారం నేపాల్ పార్లమెంట్ భవనంలో జరిగిన ఎన్నికలో శర్మ.. 598 ఓట్లకుగానూ 338 ఓట్లు సాధించి ప్రత్యర్థి సుశీల్ కోయిరాలాపై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. దేశాధ్యక్షుడు రామ్‌బరన్ యాదవ్‌.. నూతన ప్రధాని చేత ప్రమాణం చేయించడం ఇక లాంఛనమే. కాగా, ప్రధానిగా ఎన్నికయిన శర్మకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు పీఎంవో ట్విట్టర్ ద్వారా తెలిపింది.

సుశీల్ కోయిరాలా శనివారం ప్రధాని పదవికి రాజీనామాచేయడంతో నూతన ప్రధానిని ఎన్నుకోవడం అనివార్యమయింది. కాగా, రాజీనామా చేసినప్పటికీ కోయిరాలా.. నేపాలి కాంగ్రెస్ (ఎన్ సీ) తరఫున పదవికి పోటీలో నిలిచారు. అటు నేపాల్ మావోయిస్టు పార్టీ (యునైటెడ్ మార్క్సిస్టు, లెనినిస్టు) నుంచి కె.పి. శర్మ బరిలోకిదిగారు. సుశీల్ పేరును మాజీ ప్రధాని, సీనియర్ ఎన్‌సి నేత షేర్ బహదూర్ దూబే  ప్రతిపాదించారు.

ఏడేళ్ల సంప్రదింపుల అనంతరం నేపాల్‌లో గత సెప్టెంబర్ 20న కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. కాగా మాదేసీ సహా కొన్ని మైనారిటీ వర్గాలు కొత్త రాజ్యాంగాన్ని మొదటినుంచీ వ్యతిరేకిస్తునే ఉన్నాయి. ఆందోళనల్లో దాదాపు 40 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు