ఒకే గుండెతో పుట్టారు.. విడదీయగలరా?

18 Mar, 2017 12:48 IST|Sakshi
ఒకే గుండెతో పుట్టారు.. విడదీయగలరా?

హెబ్రోన్‌: పాలస్తీనాకు చెందిన ఓ మహిళ గురువారం ఒకే గుండెతో పుట్టిన ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. సాధారణంగా జన్యులోపాల కారణంగా కవలలు ఇలా జన్మిస్తారు. వీరికి అసిల్‌, హదిల్‌ అని పేర్లు పెట్టినట్లు వారి తండ్రి అన్వర్‌ జ్వాదత్‌ తెలిపారు. పిల్లలను వేరు చేయడానికి కుదురుతుందని డాక్టర్లు చెప్పినట్లు వెల్లడించారు. అయితే, పాలస్తీనాలో అంత టెక్నాలజీ అందుబాబులో లేదని సౌదీ అరేబియాలో ఆపరేషన్‌ సాధ్యపడుతుందని చెప్పినట్లు వివరించారు.

అసిల్‌, హదిల్‌ల శరీరాలు నడుము భాగం నుంచి గుండె వరకూ కలిసి ఉన్నాయి. ఇరువురికీ ఒకే గుండె ఉంది. దీంతో ఇరువురినీ వేరు చేయాలంటే ఇద్దరు బిడ్డల్లో ఒకరికి వేరే గుండెను అమర్చాల్సి ఉంటుంది. ఆపరేషన్‌కు చాలా డబ్బు అవసరమవుతుందని ఇప్పటివరకూ దాతలెవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదని అన్వర్‌ తెలిపారు. పాలస్తీనాలో వైద్యం కోసం ఎదురుచూసేవారికి ఇజ్రాయెల్‌ వైద్య సాయం చేస్తుంది. ఆ వైద్యానికి అయ్యే ఖర్చు మాత్రం పాలస్తీనా ప్రభుత్వం భరిస్తుంది. అయితే, ఈ కవలలకు అవసరమయ్యే ఆపరేషన్‌పై ప్రభుత్వం కూడా ఎలాంటి సాయం ఇంకా ప్రకటించలేదు.

మరిన్ని వార్తలు