మళ్లీ కామెరానే బ్రిటిష్ ప్రధాని

8 May, 2015 17:30 IST|Sakshi
మళ్లీ కామెరానే బ్రిటిష్ ప్రధాని

లండన్: బ్రిటన్ అధికారపీఠం కోసం హోరా హోరీగా సాగిన  పోరులో  కన్జర్వేటివ్ పార్టీ  ఘన విజయం సాధించింది.  ప్రధాని  డేవిడ్ కామెరాన్ మరోసారి  ప్రధాని పీఠాన్నిఅధిరోహించేందుకు సన్నద్ధమవుతున్నారు. అధికార కన్సర్వేటివ్ పార్టీ  ఇప్పటికి 326 సీట్లను గెల్చుకుంటే, ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ 230 సీట్లు సాధించింది. 643 స్థానాల్లో ఫలితాలను వెల్లడించారు. మరో 7 సీట్లకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉండగానే కన్సర్వేటివ్స్ విజయం ఖాయమైపోయింది. సాధారణ మెజారిటీకి కావల్సిన 326 మ్యాజిక్ మార్కును సాధించారు. ఎగ్జిట్ పోల్స్కు అంచనాలకు కొంచెం అటూ ఇటుగా ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు డేవిడ్ కామెరాన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. అందుకోసం ఆయన బ్రిటిష్ రాణిని అనుమతి కోరారు.
స్కాటిష్ నేషనల్ పార్టీ సంచలన విజయాలను నమోదు చేసింది. 56 సీట్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఒక విధంగా వీరి ఫలితం ప్రధాన ప్రతిపక్షాన్ని బాగా దెబ్బతీసిందని చెప్పవచ్చు.
మొత్తం కాగా మొత్తం 650 స్థానాలకు ఇప్పటివరకు ఫలితాలు  ఇలా ఉన్నాయి.

కన్జర్వేటివ్ పార్టీ 326
లేబర్ పార్టీ 230
స్కాటిష్ నేషనల్ పార్టీ  56
లిబరల్ డెమోక్రటిక్ పార్టీ  8
డియూపి 8
ఇతరులు 15
 రాణి ఎలిజబెత్  అధికారిక ప్రకటన అనంతరం  ఈ నెల  27న కొత్త పార్లమెంటు కొలువుదీరనుంది.
కాగా మొత్తం 650 స్థానాలకు, 316 స్థానాలు కన్జర్వేటివ్ పార్టీ, ప్రతిపక్షం లేబర్ పార్టీ  239  స్థానాలు గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. 

విపక్షనేత రాజీనామా

బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రతిపక్ష నేత ఎడ్ మిలిబాండ్ తన పదవికి రాజీనామా చేశారు. లేబర్ పార్టీ ఇక ఓటమిని అంగీకరించక తప్పలేదు.

మోదీ అభినందనలు
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ను అభినందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయనకు అభినందనలు తెలిపారు. 'ఫిర్ ఏక్ బార్.. కామెరాన్ సర్కార్' (మరోసారి కామెరాన్ ప్రభుత్వమే) అంటూ తన ఎన్నికల సమయం నాటి నినాదాన్ని గుర్తుచేశారు. అప్పట్లో 'అబ్ కీ బార్ మోదీ సర్కార్' అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు