సారీ... దీపావళికి సెలవు ఇవ్వలేం!

12 Jan, 2018 09:54 IST|Sakshi

టెక్సాస్‌ : దీపావళిని సెలవు దినంగా పరిగణించాలన్న భారతీయుల విజ్ఞప్తిని అమెరికాలోని ఓ విద్యాసంస్థ తిరస్కరించింది. హిందు పండగలను సెలవు దినాలుగా పరిగణించటం కుదరదని తేల్చి చెప్పింది. మతపరమైన దినాలను సెలవులుగా పరిగణించటం వీలు కాదని.. విద్యార్థులు హాజరుకాకపోతే అది గైర్హాజరు(అబ్‌సెంట్‌) కిందకే వస్తుందని ఓ ప్రకటనలో పేర్కొంది. 

‘‘అది హిందువుల పండగా. ఇక్కడ సంప్రదాయానికి సంబంధం లేనిది. పైగా కొత్త నిబంధనల ప్రకారం... మత సంబంధిత వేడుకలకు సెలవులు ఇవ్వకూడదని స్పష్టం ఉంది. అలాంటప్పుడు దీపావళికే కాదు.. ఏ పండగలకు కూడా సెలవులు ఇవ్వటం కుదరదని’’ ఐఎస్‌డీ తెలిపింది. అయితే గుడ్‌ప్రైడే విషయంలో మినహాయింపు ఇవ్వటంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. దానిని ప్రోఫెషనల్‌ డే(వెదర్‌ డే) గా మాత్రమే పరిగణిస్తున్నామని వివరణ ఇచ్చింది. 

టెక్సాస్‌ ఎడ్యుకేషన్‌ ఏజెన్సీ పరిధిలోని కొప్పెల్‌ ఇండిపెండెట్‌ స్కూల్‌ డిస్ట్రిక్‌ లో చదువుతున్న విద్యార్థుల్లో 43.88 శాతం ఆసియా వాసులే. వీరిలో వందల సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. అందులో మెజార్టీ దక్షిణ భారత దేశానికి చెందిన వారే ఉన్నారు. తల్లిదండ్రులంతా కలిసి దీపావళిని సెలవు దినంగా ప్రకటించాలని గత కొంత కాలంగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. తాజాగా ఐఎస్‌డీ ఈ ఏడాదికిగానూ సెలవుల జాబితా ప్రకటించింది. ఇందులో దీపావళిని చేర్చకపోవటంతో భారతీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం నిరాశజనకంగా ఉందని యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ అసోసియేట్‌ ఫ్రొఫెసర్‌ పంకజ్‌ జైన్‌ వెల్లడించారు. 

సంతకాల సేకరణ... 

దీపావళికి సెలవు ప్రకటించాలని కొప్పెల్‌ ఐఎస్‌డీలో ఉద్యమం పెద్ద ఎత్తునే జరిగింది. ఆ సమయంలో కొందరు భారతీయ విద్యార్థులు సంతకాల సేకరణ చేపట్టగా..  దానిపై 1700 మంది సంతకాలు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై పంకజ్‌ జైన్‌ గతంలో ఐఎస్‌డీ సూపరిడెంట్‌ బ్రాడ్‌ హంట్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే ఐఎస్‌డీ మాత్రం అవేం పట్టించుకోలేదు. 

2003లో తొలిసారి వైట్‌ హౌస్‌లో అధ్యక్షుడు జార్జి బుష్‌ దీపావళి వేడుకల్లో పాల్గొనగా.. అప్పటి నుంచి అది కొనసాగుతూ వస్తోంది. గతేడాది ట్రంప్‌ కుటుంబం వేడుకలో కూడా ఉత్సాహంగా పాల్గొనగా.. దీపావళికి గుర్తుగా ఓ స్టాంప్‌ను కూడా విడుదల చేశారు. ఇక ఐక్యరాజ్యసమితి కూడా 2014 నుంచి దీపావళి వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం యూఎన్‌ఓకి ఈ పండగ అప్షనల్‌ హాలీడేగా ఉంది. మరోవైపు న్యూ యార్క్‌, న్యూ జెర్సీ ల్లో దీపావళిని ఫ్రొఫెషనల్‌ డెవెలప్‌మెంట్‌(వెదర్‌ డే) గా పరిగణిస్తున్నారు. ఈస్ట్‌ మిడో స్కూల్‌ డిస్ట్రిక్‌, ఈస్ట్‌ విలిస్టన్‌ యూనియన్‌ ఫ్రీ స్కూల్‌ డిస్ట్రిక్‌, హాప్‌ హలో హిల్స్‌ సెంట్రల్‌ స్కూల్‌ డిస్ట్రిక్‌, హెర్రిక్స్‌ యూనియన్‌ ఫ్రీ స్కూల్‌ డిస్ట్రిక్‌ లలో దీపావళిని సెలవు దినంగా ప్రకటించాయి.

మరిన్ని వార్తలు