క‌రోనా : పాకిస్తాన్‌లో ఒక్క‌రోజే 248 కొత్త కేసులు

9 Apr, 2020 15:22 IST|Sakshi

ఇస్తామాబాద్ : క‌ంటికి క‌నిపించ‌ని చిన్న వైర‌స్‌..ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తూ మృత్యు ఘంటిక‌ల‌ను మోగిస్తుంది. పాకిస్తాన్‌లో గురువారం ఒక్క‌రోజే 248 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో కోవిడ్ బాధితుల సంఖ్య 4,322కు చేరుకుంది. దేశంలో రెండువారాల పాక్షిక లాక్‌డౌన్ ఉన్న‌ప్ప‌టికీ వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. జాతీయ ఆరోగ్య సేవ‌ల మంత్రిత్వ శాఖ లెక్క‌ల ప్ర‌కారం..క‌రోనా కార‌ణంగా దేశంలో 60 మంది మ‌ర‌ణించగా, 572 మంది కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన కేసుల్లో పంజాబ్‌లోనే  కేసుల సంఖ్య అధికంగా ఉంది. 

పెరుగుతున్న క‌రోనా బాధితుల‌కు చికిత్స అందించ‌డానికి స‌రిప‌డా  ఆసుప‌త్రులు కూడా లేవ‌ని బుధ‌వారం ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లంతా స్వీయ నిర్భందంలోనే ఉండి, ప్ర‌భుత్వ ఆదేశాల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని సూచించారు. అయితే సంపూర్ణ లాక్‌డౌన్ విధించ‌కూడ‌ద‌నే త‌న నిర్ణ‌యాన్ని మాత్రం స‌మ‌ర్థించుకున్నారు. దేశంలో 50 మిలియ‌న్ల‌కు పైగా దారిద్ర్య‌రేఖ‌కు దిగువ‌న ఉన్నార‌ని, సంపూర్ణ లాక్‌డౌన్ అమ‌లుచేస్తే వారంతా ఆక‌లితో చ‌నిపోతార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదిలావుండగా, ప్రధాని గురువారం "ఎహ్సాస్ ఎమర్జెన్సీ క్యాష్ ప్రోగ్రాం" ను ప్రారంభించారు. దీని ద్వారా కరోనావైరస్ సంక్షోభంలో చిక్కుకున్న 12 మిలియన్ల పేద కుటుంబాలకు  మొత్తం రూ.144 బిలియన్ల నగదు  పంపిణీ కానుంది. బయోమెట్రిక్ వెరిఫికేష‌న్  తర్వాత వచ్చే రెండున్నర వారాల్లోనే  పేద కుటుంబాల‌కు ఈ స‌హాయం అంద‌నుంది.
 

మరిన్ని వార్తలు