మాజీ కెప్టెన్‌కు కరోనా పాజిటివ్‌

20 Jun, 2020 18:22 IST|Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌ క్రికెటర్‌,‌ మాజీ కెప్టెన్‌ మష్రాఫ్‌ మోర్తాజా(36) కరోనా వైరస్‌ బారిన పడ్డారు. శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో ప్రస్తుతం మష్రాఫ్‌ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ క్రమంలో మోర్తాజా సోదరుడు మాట్లాడుతూ.. ‘నా సోదరుడికి రెండు రోజులుగా జ్వరంగా ఉంది. నిన్న రాత్రి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ రోజు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇంట్లో స్వీయ నిర్భంధంలో ఉన్నాడు’. అని తెలిపారు. ఇక కరోనా సోకిన రెండో బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ మోర్తాజా.  అంతకుముందు కొన్ని గంటల క్రితమే మరో క్రికెటర్‌ నఫీస్‌ ఇక్బాల్‌ కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. (దాదా ఇంట్లో మరో ఇద్దరికి కరోనా)

కాగా బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ సభ్యుడైన మోర్తాజా ఇప్పటికి క్రికెట్‌ నుంచి విరమణ పొందలేదు. మర్తాజా తన కెరీర్‌లో 220 వన్డేలు, 36 టెస్టులు, 54 టీ-20లు ఆడారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనా సోకిన 300 కుటుంబాలకు సాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక బంగ్లాదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. ఇప్పటి వరకు 1,05,000 మంది కరోనా బారిన పడగా,  1,300 మంది మరణించారు. దాదాపు 43, 000 వేల మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 

ఇదిలా ఉండగా ఇప్పటి వరకు అయిదుగురు అంతర్జాతీయ క్రికెటర్లకు కరోనా నిర్ధారణ జరిగింది. మే నెలలో పాకిస్తాన్‌ మాజీ ఓపెనర్‌ తౌఫీక్‌ ఉమర్‌కు కరోనా పాజిటివ్‌ రాగా ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. గతవారం పాకిస్తాన్‌ లెజెండ్‌ షాహిద్‌ అఫ్రిది కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. శనివారం మోర్తాజా, ఇక్బాల్‌ కరోనా బారిన పడగా..మరో పాకిస్తాన్‌ మాజీ ఆటగాళ్లు జాఫర్‌ సర్ఫ్రాజ్‌, రియాజ్‌ షేక్‌ కూడా కరోనా సోకినట్లు తేలింది.(‘ఎందరున్నా జడేజానా అత్యుత్తమం’)

>
మరిన్ని వార్తలు