ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌!

1 Apr, 2020 01:42 IST|Sakshi

అమెరికాలో ఊడుతున్న మనవాళ్ల ఉద్యోగాలు

కాంట్రాక్టు ఉద్యోగులను  తొలగిస్తున్న కంపెనీలు

40 వేల మందికి తప్పని ఉద్వాసన

ఫుల్‌ టైం ఉద్యోగుల  విషయంలో ఆచితూచి..

లే ఆఫ్‌ ఉండబోదని  ప్రకటించిన ఫేస్‌బుక్, ఆపిల్, మైక్రోసాఫ్ట్‌

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కరోనా దెబ్బకు డాలర్‌ కల చెదురుతోంది. అమెరికాలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు అక్కడి భారతీయ ఐటీ నిపుణులకు నిద్రలేకుండా చేస్తోంది. కరోనా నుంచి కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్న మనవాళ్లు రానున్న  గడ్డు కాలాన్ని తలుచుకుని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రపంచ ఆర్థిక రాజధానిగా పేరొందిన న్యూయార్క్‌.. కరోనా దెబ్బకు విలవిల్లాడుతోంది. న్యూయార్క్, దాన్ని ఆనుకుని ఉన్న న్యూజెర్సీ కనెక్టికట్‌లో 86,361 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీని బారిన పడ్డ వారిలో ఇప్పటికే 1,459 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క న్యూయార్క్‌లోనే 38,087 మంది కరోనా బాధితులు ఉండగా, వారిలో 914 మంది మరణించారు. గడిచిన 15 రోజులుగా న్యూయార్క్‌లో అన్ని వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు ఆగిపోయాయి.

ఈ రెండు రాష్ట్రాలకు వెళ్లొద్దంటూ అమెరికా ప్రభుత్వం పౌరులను హెచ్చరించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరో మూడు నెలల పాటు న్యూయార్క్‌లో పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఇప్పటికే ప్రకటించారు. దీంతో అక్కడ కార్యకలాపాలు నిర్వహించే పలు కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. మార్చి నెలాఖరుతో కాంట్రాక్టు గడువు పూర్తయిన 40 వేల మందికి గడువు పొడిగించలేదు. వీరిలో చాలామంది భారతీయులే. ఇప్పుడు ఉద్యోగాలు పోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ‘ఓవైపు కరోనాతో యుద్ధం చేస్తున్నాం. ఉన్న సరుకులను కొద్దికొద్దిగా వాడుకుంటున్నాం. మా కాంట్రాక్టు ముగిసిందంటూ మెయిల్‌ వచ్చింది. ఈ కఠిన పరిస్థితుల్లో భారత్‌ రావడమే మేలని భావించాం. అయితే విమానాలు లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ నేను, నా కుటుంబం కాలం గడుపుతున్నాం’అని జీఈ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న మంచిరెడ్డి శ్రీకాంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

లక్ష మందికి గడ్డుకాలమే..
హెచ్‌1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల్లో దాదాపు లక్ష మంది ఉద్యోగాలు కోల్పోతారని న్యూయార్క్‌ టైమ్స్‌ అంచనా వేసింది. ‘చాలామంది భారతీయులు ఉద్యోగాలు వదిలేసి స్వదేశం వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ ఇళ్లు, కార్లు వదిలేసి పోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. కరోనాతో 2 లక్షల మంది పనిపోతుందని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో భారతీయులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. తనను ఎలాగైనా భారత్‌కు పంపాలని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో పని చేసే పురాణపండ గాయత్రి యాజమాన్యాన్ని వేడుకుంటున్నారు. ఇలాంటి వారు చాలామంది న్యూయార్క్‌ టైమ్స్‌కు మెయిల్స్‌ ద్వారా వారి ఆందోళనను వెలిబుచ్చారు.

ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా సత్వరం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’అని న్యూయార్క్‌ టైమ్స్‌ తన సోమవారం నాటి సంచికలో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం వచ్చే మూడు నెలల్లో లక్ష మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోతారు. మార్చి నుంచి జూన్‌ దాక వివిధ ప్రాజెక్టుల్లో కొనసాగుతున్న ఉద్యోగులను వదిలించుకోవాలని కంపెనీలు నిర్ణయానికి వచ్చాయి. ఈ లెక్కన అమెరికాలో ఎన్ని ఉద్యోగాలు పోతాయో.. వారిలో ఎందరు భారతీయులు ఉంటారని కచ్చితంగా చెప్పలేమని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, బర్కిలీకి చెందిన ప్రొఫెసర్‌ జాన్‌ ఎల్‌ హెలిబ్రాన్‌ పేర్కొన్నట్లు కాలిఫోర్నియా టైమ్స్‌ ప్రచురించింది.

ఫుల్‌టైమ్‌ ఉద్యోగులకూ లేని గ్యారంటీ
అమెరికాలోని పలు కంపెనీల్లో పనిచేస్తున్న ఫుల్‌టైం ఉద్యోగులకూ ఉద్యోగ భద్రత ఉండకపోవచ్చని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సోషియాలజీ విభాగం ప్రొఫెసర్‌ డేనియల్‌ ఎ. మెక్‌ఫార్లాండ్‌ అభిప్రాయపడ్డారు. న్యూయార్క్‌కు చెందిన బ్లూమ్‌బర్గ్, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వంటి అత్యంత పటిష్టమైన సంస్థలు ఇప్పుడు లే ఆఫ్‌ల విషయంలో దృష్టి సారిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, మెజారిటీ భారతీయు లు ఇప్పుడు ఉద్యోగాల గురించి ఆలోచించట్లేదని, , కరోనా గండం నుంచి గట్టెక్కితే చాలని అనుకుంటున్నారని కాలిఫోర్నియా టైమ్స్‌ సూచించింది. దాదా పు వంద మంది భారతీయ ఐటీ నిపుణుల నుంచి ఈ పత్రిక అభిప్రాయాలు రాబట్టింది. వారిలో 67 మంది తమకు ఇప్పుడు ఉద్యోగాల కంటే కరోనా నుంచి బయటపడటమే ముఖ్యమని భావిస్తున్నారు.

అమెరికా నుంచి బయటపడితే చాలని అనుకుంటున్నామని 17 మంది పేర్కొన్నారు. తమకు ఉద్యోగం పోయినా సరే 6 నెలలు ఇక్కడే ఉండటానికి వీలు కల్పిస్తే చాలని 16 మంది అభిప్రాయపడ్డారు. లే ఆఫ్‌ లు (ఉద్యోగుల తొలగింపు) ఉండబోవని కాలిఫోర్ని యా కేంద్రంగా పని చేస్తున్న ఫేస్‌బుక్, ఆపిల్, వాషింగ్టన్‌ (సియాటిల్‌) కేంద్రంగా ఉన్న మైక్రోసాఫ్ట్‌ ప్రకటించాయి. వచ్చే ఏడాది పాటు తమ వ్యాపార కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని పరిమితంగా లే ఆఫ్‌ ప్రకటించే విషయాన్ని పరిశీలిస్తున్నామని గూగుల్, అమెజాన్‌ పేర్కొన్నాయి. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీ కార్యకలాపాల్లో కొంత మందగమనం ఏర్పడిందని అమెజాన్‌ అంటోంది. అయితే సీనియర్‌ ఉద్యోగుల స్థాయిలోనే (3 లక్షల డాలర్ల వార్షిక వేతనం దాటిన) లే ఆఫ్‌లు ఉండే అవకాశం ఉందని ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (ఈడీఏ) పేర్కొంది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు