అధ్వాన్నం: దేశాధినేతలకు డ‌బ్ల్యూహెచ్‌ఓ అక్షింతలు 

14 Jul, 2020 11:03 IST|Sakshi

చాలా దేశాలు తప్పుడు విధానాలు అవలంబిస్తున్నాయి: డ‌బ్ల్యూహెచ్‌ఓ

మరింత అధ్వాన్నంగా మారనున్న పరిస్థితి

ఇప్పట్లో సాధారణ స్థితి వచ్చే ఆశ లేదు

జెనీవా : ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభింస్తున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డ‌బ్ల్యూహెచ్‌ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి చాలా తీవ్రతరం అవుతోందని, సమీప భవిష‍్యత్తులో తిరిగి సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం కనిపించడం లేదని హెచ్చరించింది. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని డ‌బ్ల్యూహెచ్‌ఓ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ టెడ్రోస్ అథ‌న‌మ్ గేబ్రియేసన్‌ తాజాగా సూచించారు.

యూరోప్‌, ఆసియా దేశాలు మహమ్మారి కట్టడిలో కొంత విజయం సాధించినప్పటికీ  చాలా వ‌ర‌కు ప్ర‌పంచ దేశాలు వైర‌స్‌ను ఎదుర్కొనే అంశంలో త‌ప్పుడు విధానాలు అవలంబిస్తున్నాయని  టెడ్రోస్‌ వ్యాఖ్యానించారు. పటిష్టమైన చ‌ర్య‌ల‌ను అమ‌లు చేయ‌‌ని కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. జెనీవాలో సోమవారం (నిన్న) మీడియాతో మాట్లాడిన ఆయన నిర్దిష్టంగా నాయకుల పేర్లను ప్రస్తావించకుండానే  దేశాధినేతలపై విమర్శలు చేశారు. మ‌హ‌మ్మారి నియంత్ర‌ణ‌లో దేశాధినేత‌ల మిశ్ర‌మ సందేశాలతో అంత్యత కీలకమైన విశ్వాసం ప్ర‌జ‌ల్లో స‌న్న‌గిల్లుతోందని టెడ్రోస్ ఆరోపించారు.

వైరస్‌ విస్తరణను అడ్డుకునేందుకు ప్రజల్లో అవగాహనతోపాటు ఆయా ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సమగ్ర చర్యలు తీసుకోకపోతే, పటిష్టమైన చర్యలు చేపట్టకపోతే పరిస్థితి మరింత దారుణంగా దిగజారి పోనుందంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సామాజిక దూరం, హ్యాండ్‌వాష్‌, మాస్క్‌ల‌ను ధ‌రించ‌డం లాంటి అంశాల‌పై ప్రజలు, ప్రభుత్వాలు దృష్టిపెట్టాలన్నారు. లేదంటే మ‌రింత అధ్వాన్న‌ప‌రిస్థితుల‌కు దారి తీస్తుందని  టెడ్రోస్‌  హెచ్చ‌రించారు.  అంతేకాదు జాగ్రత్తలు పాటించకపోతే  ఇప్పట్లో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన‌డం సాధ్యం కాదని పేర్కొన్నారు.

కాగా అమెరికాలో రికార్డు స్థాయిలో ఒక రోజులో 63,998 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు అమెరికాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 34,77,993కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 1,38,234కి చేరింది.  భారతదేశంలో ఒక రోజులో రికార్డు స్థాయిలో  27,151 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 540 మందికి పైగా ఈ వ్యాధితో మరణించారు. దీంతో మొత్తం కేసులు 9 లక్షలు దాటాయి. అటు ఒక రోజులో 276 కంటే ఎక్కువ  మరణాలతో మెక్సికో ఇటలీని అధిగమించింది. రోజు రోజుకు కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంతో డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది.   

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు