నో లాక్‌డౌన్‌ : ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు 1000 మంది హాజరు

13 Apr, 2020 19:33 IST|Sakshi

మానవాళిని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్‌  విస్తరిస్తుండటంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. కరోనా కట్టడికి నడుంబిగించి.. పటిష్ట చర్యలు అమలుచేస్తున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండేలా లాక్‌డౌన్‌ను విధించి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నాయి. బహిరంగ సమావేశాలు, పాఠశాలలు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌​ అని మూసివేశారు. అయితే ఒక్క దేశం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. అదే బెలారస్‌. ఈ దేశంలో కనీసం లాక్‌డౌన్‌ను కూడా పూర్తి అమలు చేయడం లేదు. అంతేగాక ఇక్కడ విచ్చలవిడిగా అన్నీ ఆటలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని వీక్షించేందుకు అభిమానులు కూడా వెళుతున్నారు. ఇప్పటి వరకు బెలారస్‌లో 2919 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. (‘వారికి మాత్రమే కరోనా టెస్టులు ఉచితం’ )

కరోనావైరస్ మహమ్మారి కారణంగా బెలారస్‌లో ఆటలను బహిష్కరించాలనే వారి సంఖ్య పెరుగుతన్నప్పటికీ ఆదివారం బెలారసియన్ టాప్-ఫ్లైట్ లీగ్ మ్యాచ్‌కు దాదాపు వెయ్యి మంది అభిమానులు హాజరయ్యారు. ఒకరినొకరు ఉత్సాహపరచుకుంటూ.. నినాదాలు చేశారు. కాగా ప్రస్తుతం జాతీయ సాకర్ లీగ్ ఆడుతున్న దేశం యూరప్‌లో బెలారస్ మాత్రమే. అంతేగాకుండా ఫుట్‌బాల్‌ను బహిరంగంగా స్టేడియంలో నిర్వహించడానికి ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకాషెంకో నుంచి అనుమతి కూడా తీసుకుంది. (హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం కేసీఆర్‌)

అయితే ఈ ఆటకు చాలా మంది  దూరంగా ఉన్నప్పటికీ దాదాపు 1000 మందికిపైగా హాజరయ్యారు. వీరిలో అతి కొద్దిమంది మాత్రమే ముఖానికి మాస్కులు ధరించి కనిపించారు. కాగా కరోనాను అదుపు చేయడానికి కఠిన చర్యలను తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ బెలారస్‌ అధికారులను కోరింది. ఈ మాటలను పెడ చెవిన పెట్టిన బెలారస్‌ అధ్యక్షుడు దేశంలో లాక్‌డౌన్‌ అమలును వ్యతిరేకిస్తున్నాడు. దీనికి తోడు వైరస్‌పై ప్రజలు పెంచుకుంటున్న భయాలను ‘సైకోసిస్‌’గా కొట్టిపారేశారు. ఆర్థిక వ్యవస్థను కొనసాగించడం ముఖ్యమని చెప్పిన అలెగ్జాండర్‌.. మద్యంపై కూడా నిషేధం విధించలేదు. (అక్కడ నెమ్మదించిన మహమ్మారి.. )

మరిన్ని వార్తలు