‘కోవిడ్‌’పై మిస్టర్‌ పి విజయం

27 Mar, 2020 18:58 IST|Sakshi

రోమ్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ధాటికి కుప్పకూలిన ఇటలీలో అద్భుతం చోటుచేసు​కుంది. ప్రాణాంతక కోవిడ్‌-19 బారిన పడిన 101 ఏళ్ల వయోవృద్ధుడు కోలుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రిమిని నగర డిప్యూటీ మేయర్‌ గ్లోరియా లిజి తెలిపిన వివరాల ప్రకారం... 101 ఏళ్ల ‘మిస్టర్‌పి’ అనే వ్యక్తికి వైరస్‌ సోకడంతో గతవారం ఆస్పత్రిలో చేరినట్టు వెల్లడించారు. 1919లో జన్మించిన ఆయన కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడినప్పటికీ కోలుకున్నారని తెలిపారు. ఆస్పత్రి నుంచి బుధవారం ఆయనను డిశ్చార్జి చేసినట్టు చెప్పారు. 

‘కరోనా వైరస్‌ విజృంభణ గురించి గత కొన్ని వారాలుగా విషాద గాధలు వింటున్నాం. వృద్ధులపై కోవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. కరోనా సోకినప్పటికీ ఆయన కోలుకున్నారు. ‘మిస్టర్‌ పి’ జీవించే ఉన్నారు. భరోసా కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న సమయంలో ఈ పరిణామం మాకెంతో బలాన్ని ఇచ్చింది. వందేళ్లు పైబడిన వారు కూడా కరోనాను తట్టుకుని నిలబడగలరన్న నమ్మకాన్ని ఆయన కలిగించార’ని గ్లోరియా లిజి పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో కకావికలమైన ఇటలీతో పాటు ప్రపంచానికి ‘మిస్టర్‌ పి’ ఇప్పుడు ఆశాదీపంగా మారారు. ఎందుకంటే కరోనా మృతుల్లో ఎక్కువగా వయోవృద్ధులే ఉన్నారు. (300 మందిని బలిగొన్న విష ప్రచారం)

తాజా సమాచారం ప్రకారం ఇటలీలో 80,589 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 8,215 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఒక్కరోజే 6,203 కొత్త కేసులు వెలుగులోకి రాగా, 712 మంది మృత్యువాత పడ్డారు. 10,361 మంది కోలుకోవడం ఇటలీ వాసులకు ఊరట కలిగిస్తోంది. (కరోనా పరీక్షలకు 18 కిట్లకు అనుమతి)

మరిన్ని వార్తలు